ప్రధాని తల్లి మృతి పట్ల మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించి విశ్రాంతి తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు.
''తల్లికి ప్రత్యామ్నాయం లేదు. ఆమె మీ అమ్మే కాదు.. మా అమ్మ కూడా..! నేను కూడా మా అమ్మని చాలా మిస్ అయ్యాను. మీరు ప్రోగ్రామ్‌లో వర్చువల్‌గా చేరడం మాకు చాలా గౌరవం. కార్యక్రమం తర్వాత విశ్రాంతి తీసుకోండి.'' అని మమతా బెనర్జీ అన్నారు.
అనంతరం ప్రధాని మోదీ.. మమతా బెనర్జీకి నమస్కరించి.. వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఆ సమయంలో హౌరా స్టేషన్‌లో ఉన్న ప్రజలు మోదీ-మోదీ అంటూ నినాదాలు చేశారు.
కోల్‌కతా మెట్రోకి సంబంధించి కొత్తగా నిర్మించిన జోకా-తరత్లా పర్పుల్ లైన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించారు.ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌కు తొలి వందేభారత్ రైలును అందించారు. హౌరా నుంచి న్యూజల్పాయ్‌గురి మార్గంలో వందే భారత్ రైలును పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. న్యూజల్పాయ్‌గురి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు కూాడా వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
ఓవైపు తల్లి మరణించిన బాధ ఉన్నా.. కర్తవ్య నిర్వహణను మాత్రం ప్రధాని మోదీ (PM Narendra Modi) మరవలేదు. దు:ఖాన్ని ఆపుకుంటూ.. బాధను గుండెల్లో దాచుకొని.. దేశ ప్రధానిగా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. గాంధీనగర్‌లో తన తల్లి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు ముగిసిన వెంటనే.. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. శ్మశాన వాటిక నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ బెంగాల్ (West Bengal)లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి (PM Narendra Modi Mother) హీరాబెన్ (Heeraben) కన్నుమూశారు. 100 ఏళ్ల వయసున్న ఆమె వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.శ్వాసకోస ఇబ్బందులతో మూడు రోజుల క్రితం అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆమె.. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ప్రధాని మోదీ అహ్మదాబాద్‌కు చేరుకొని.. అక్కడి నుంచి గాంధీనగర్‌కు వెళ్లారు. తన సోదరుడు పంకజ్ మోదీ నివాసంలో తల్లి పార్థివ దేహానికి నివాళి అర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు ప్రధాని మోదీ. అక్కడి నుంచి సెక్టార్ 30లో ఉన్న శ్మశాన వాటికకు తరలించి.. అంత్యక్రియలు నిర్వహించారు. ప్రధాని మోదీతో పాటు ఆయన సోదరులు తల్లి చితికి నిప్పంటించారు. ఆమె ఎంత సాధారణ జీవితాన్ని గడిపారో.. అంత్యక్రియలను కూడా అంతే సాధారణంగా నిర్వహించారు. మోదీ కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్ది మంది మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
ప్రధాని మోదీ తన తల్లి (Heeraben demise)ని తలచకొని భావోద్వేగానికి లోనయ్యారు. 100 ఏళ్ల పాటు జీవించిన తన తల్లి.. ఇప్పుడు ఈశ్వరుడి పాదాల చెంత విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన అన్నారు. సన్యాసి జీవితం, నిస్వార్థ కర్మయోగి, విలువలకు కట్టుబడి ఉండే జీవితం వంటి త్రిమూర్తి లక్షణాలను అమ్మలో ఉన్నాయని అన్నారు. తన తల్లి 100వ పుట్టిన రోజు సందర్భంగా కలిసినప్పుడు.. ఆమె తనతో చెప్పిన ఓ మాటను ఆయన గుర్తు చేసుకున్నారు. '' బుద్ధితో పనిచేయాలి. శుద్ధిగా జీవించాలి.'' అని తనకు చెప్పారని.. ట్వీట్ చేశారు ప్రధాని మోదీ .