Narendra Modi Mother Health Update: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ (Heeraben Modi)కి అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుండడంతో.. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆస్పత్రి (UN Mehta hospital)కి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. ఈ ఏడాది (2022) జూన్ 18న ఆమె వందో ఏట అడుగుపెట్టారు. ఆమె 1923 జూన్ 18న జన్మించినట్లు ప్రధాని సోదరుడు పంకజ్ మోదీ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత జీవితంలో ఆయన తల్లి హీరాబెన్ మోదీకి ప్రత్యేక స్థానం ఉంది. ప్రత్యేక సందర్భాల్లో మోదీ.. గుజరాత్ .. గాంధీనగర్‌లోని తల్లి హీరాబెన్ మోదీని కలుస్తారు. ఆమె ఆశీర్వాదాలు తీసుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ చివరగా గుజరాత్ ఎన్నికల సమయంలో తన తల్లి హీరాబెన్‌ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన ప్రధాని.. తన తల్లి నివాసానికి వెళ్లి.. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. కాసేపు అక్కడే ఉండే.. యోగక్షేమాలు తెలుసుకున్నారు. తల్లీ, కొడుకులు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఇలా ఈ తల్లీకొడుకుల బంధం.. ప్రేమానురాగాలతో నిండి ఉంటుంది.
మోదీ సోదరుడికి రోడ్డు ప్రమాదం :
మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) సోదరుడు ప్రహ్లాట్ మోదీ ప్రయాణిస్తున్న కారుకు నిన్న ప్రమాదం జరిగింది. మైసూరు సమీపంలో ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ప్రమాద సమయంలో కారులో ప్రహ్లాద్ మోదీ (Prahlad Modi) భార్య, కొడుకు, కోడలు ఉన్నట్టు తెలిసింది. ఆయన కుటుంబం మైసూరు (Mysuru) సమీపంలోని బండిపురాకు వెళుతుండగా.. కడకోల సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఘటన తర్వాత ప్రహ్లాద్ మోదీ, ఆయన కుమారుడు మెహుల్ మోదీ, కోడలు జిందాల్ మోదీ, మనవడు మెహత్, కారు డ్రైవర్ సత్యనారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.