PM MODI JAMMU KSAHMIR VISIT UPDATES BLAST IN JAMMU AHEAD OF PM TOUR MODI TO START RS20K WORKS MKS
PM Modi J&K Visit: ప్రధాని మోదీ పర్యటన వేళ పేలుడు కలకలం -జమ్మూకాశ్మీర్లో భారీ కార్యక్రమాలు
పేలుడు జరిగిన చోట పోలీసులు, మోదీ పర్యటనకు భద్రత
జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా జమ్మూకాశ్మీర్ లోని మారు మూల గ్రామం నుంచి మోదీ యావత్ జాతికి సందేశం వినిపించనున్నారు. కాగా, మోదీ రాకకు ముందు జమ్మూలో పేలుడు కలకలం చోటుచేసుకుంది.
స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత జమ్మూకాశ్మీర్ లో తొలిసారి పర్యటిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా జమ్మూకాశ్మీర్ లోని మారు మూల గ్రామం నుంచి మోదీ యావత్ జాతికి సందేశం వినిపించనున్నారు. ఆదివారం ప్రధాని మోదీ రాక సందర్భంగా జమ్మూకాశ్మీర్ లో భారీ కార్యక్రమాలు జరుగనున్నాయి. కాగా, ప్రధాని రాకకు ముందు, ఆయన నిర్వహించబోయే సభకు 12 కిలోమీటర్ల దూరంలో పేలుడు కలకలం చోటుచేసుకుంది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి పూర్తి స్థాయి పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ జమ్మూకాశ్మీర్ విచ్చేయనున్నారు. సాంబా జిల్లాలోని పల్లీ గ్రామంలో బహిరంగ సభను ఉద్దేశించి మోదీ మాట్లాడుతారు. సభా స్థలికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాలియన్ గ్రామంలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. జమ్మూ జిల్లాలో బిష్నా పరిధిలోకి వచ్చే ఈ గ్రామంలో పేలుడుపై భద్రతా బలగాలు ఆరాతీస్తున్నాయి. గ్రామంలోని బహిరంగ వ్యవసాయ భూమిలో అనుమానాస్పద పేలుడు సంభవించినట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. బహుశా ఇది పిడుగుపాటు లేదా ఉల్క వల్ల ఏర్పడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై విచారణ కొనసాగుతున్నది. అదే సమయంలో మోదీ పర్యటనకు అసాధారణ భద్రత కల్పించారు.
జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్లు, ఉగ్రదాడులు కొనసాగుతున్న దరిమిలా ఆదివారం నాటి ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎన్ఐఏ చీఫ్ కుల్ దీప్ సింగ్ స్వయంగా పల్లీ గ్రామాంలో పర్యటించి సభా స్థలి వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. శుక్రవారం కూడా సుంజ్వాన్ ప్రాంతంలో ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఎన్ఐఏ చీఫ్ అక్కడికీ వెళ్లొచ్చారు. కాగా, కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత తొలిసారి వస్తోన్న ప్రధాని మోదీ జమ్మూకాశ్మీర్ లో భారీ ఎత్తున అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
రూ.3,100 కోట్లతో నిర్మించిన బనిహాల్-కాజీగుండ్ టన్నెల్ ప్రారంభోత్సవం సహా మొత్తం రూ.20వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ది పనులకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా సాంబా జిల్లాలోని పల్లీ గ్రామం నుంచి దేశవ్యాప్తంగా గ్రామ సభలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. రూ.750కోట్లతో నిర్మించనున్న ఢిల్లీ అమృత్ సర్ -కాట్రా ఎక్స్ ప్రెస్ వే, చీనాబ్ నదిపై నిర్మించనున్న రెండు జల విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.