భారత ఉపరితల రవాణా కీర్తి కిరీటంలోకి మరో కలికితురాయి చేరింది. దేశ ప్రజారవాణా వ్యవస్థలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆరంభమైంది. మహారాష్ట్రలో రెండో అతిపెద్ద నగరం పుణెలో మెట్రో రైలు సేవలు మొదలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు పుణె మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో పచ్చ జెండా ఊపి రైలు సేవలను ప్రారంభించిన ప్రధాని.. టికెట్ కొనుక్కొని మరీ తొలి ప్రయాణం చేశారు. మెట్రో రైల్ సేవలతోపాటే పుణెలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్ధాపనలు చేశారు.
పుణె పర్యటన కోసం ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రధాని మోదీ.. తొలుత పుణె మున్సిపల్ కార్పొరేషన్(పీఎంసీ) కార్యాలయం వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 9.5 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని పీఎంసీ ఏర్పాటు చేసింది. ఆ వెంటనే, గర్వారే మెట్రో స్టేషన్ కు చేరుకున్న ప్రధాని అక్కడ పచ్చ జెండా ఊపి పుణే మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
టికెట్ కొనుక్కొని మరీ రైలెక్కిన ప్రధాని మోదీ... గర్వారే మెట్రో స్టేషన్ నుంచి ఆనంద్ నగర్ స్టేషన్ వరకు సామాన్యులతో కలిసి ప్రయాణించారు. మెట్రో రైలు రాకతో పుణేలో అర్బన్ మొబిలిటీ కోసం అంతర్జాతీయ శ్రేణి మౌలిక ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినట్లయింది. ప్రధాని మోదీ చేతుల మీదుగానే పుణె మెట్రో రైల్ ప్రాజెక్టుకు 2016 డిసెంబర్ 24న పురుడుపోసుకుంది. ఈ ప్రాజెక్టు అంచనా రూ 11,440 కోట్లు. సిటీలో మొత్తం 32.2 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైల్ నిర్మితమవుతుండగా తొలి 12 కిలోమీటర్ల మార్గాన్ని మోదీ ప్రారంభించారు. కాగా,
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी पुणे मेट्रो में गरवारे कॉलेज मेट्रो स्टेशन से आनंद नगर मेट्रो स्टेशन की यात्रा के दौरान मेट्रो ट्रेन में बैठे स्कूली छात्रों से बातचीत की। pic.twitter.com/MJDkbwbRNS
— ANI_HindiNews (@AHindinews) March 6, 2022
పుణె మెట్రో రైల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ వెంట మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ, కీలక శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా ప్రధానితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నా, చివరి నిమిషంలో మిన్నకుండిపోయారు. గవర్నర్ల వ్యవస్థను మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందంటూ విపక్ష సీఎంలు చేస్తోన్న ఆందోళనలో మహా సీఎం ఠాక్రే కీలక భూమిక పోషిస్తోన్న క్రమంలో పుణె మెట్రో ప్రారంభోత్సవారానికి ఆయన రాకపోవడం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Metro Train, Pm modi, Pune