PM MODI FIRST MANN KI BAAT ADDRESS OF 2022 TALKS ABOUT AMAR JAWAN JYOTI AND CORRUPTION PVN
Maan Ki Baat : అమర్ జవాన్ జ్యోతి విలీనంపై Modi కీలక వివరణ.. ప్రధానికి కోటి మంది బాలల లేఖలు
గంధీజీకి మోదీ నివాళి
PM Modi : కోటి మందికిపైగా పిల్లలు తమ మన్ కీ బాత్ ను పోస్టుకార్డుల ద్వారా పంపించారని మోదీ తెలిపారు. దేశవిదేశాల నుంచి వచ్చిన ఈ పోస్టుకార్డులు దేశ భవిష్యత్తుపై నవతరానికి ఉన్న దృక్పథాన్ని తెలుపుతున్నాయని చెప్పుకొచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా గేట్ సమీపంలో 50 ఏళ్లుగా వెలిగిన అమర్ జవాన్ జ్యోతిని అక్కడి నుంచి తరలించి, జాతీయ యుద్ధ స్మారకం వద్ద జ్యోతిలో విలీనం చేయడంపై విపక్షాల విమర్శలకు ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. ఆదివారం మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలకు సందేశమిచ్చిన ప్రధాని.. అమర జవాన్ జ్యోతి విలీనంపై కీలక కామెంట్లు చేశారు. ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర ఉన్న అమర జవాన్ జ్యోతిని, జాతీయ యుద్ధ స్మారకం(National War Memorial)ఉన్న జ్యోతితో కలిపిన క్షణం అమరుల కుటుంబీకులు భావోద్వేగానికి గురయ్యారని ప్రధాని తెలిపారు. ఆ సమయంలో వారి కళ్లు చెమర్చాయని వ్యాఖ్యానించారు.
అమర్ జవాన్ జ్యోతి విలీనం చేయడాన్ని హర్షిస్తూ ఎందరో మాజీ సైనికులు తనకు లేఖ రాశారని ప్రధాని చెప్పారు. జాతీయ యుద్ధ స్మారకంలో అమర జవాన్ జ్యోతిని విలీనం చేలి అమరులకు ఘన నివాళి ఇచ్చినట్లు అయిందని వారు లేఖలో పేర్కొన్నట్లు మోదీ తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రకటించిన బాల పురస్కారాలు, పద్మ అవార్డులను సామాన్యలకు ప్రదానం చేయడాన్ని ప్రశంసించారని చెప్పారు. అమర జవాన్ జ్యోతి విలీనం జరిగిన యుద్ధ స్మారకాన్ని సందర్శించాలని ఈ సందర్భంగా ప్రధాని కోరారు.
ప్రధాని మోదీ.. ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే "మన్ కీ బాత్" రేడియో కార్యక్రమంలో ఇవాళ మాట్లాడారు. ఈ ఏడాదిలో మన్‌కీ బాత్ కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ పలు కీలక విషయాలను ప్రస్తావించారు.కొత్త ఆశలతో 2022లో అడుగు పెట్టామని అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ పుణ్యతిథి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. నివాళి అర్పించారు. స్వాతంత్య్ర పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడి.. గుర్తింపు లేకుండా పోయిన వీరులను స్మరించుకుంటున్నామని చెప్పారు. వారంతా అన్ సంగ్ హీరోలని ప్రధాని అన్నారు. వారందరికీ నివాళి అర్పించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని మోడీ గుర్తు చేశారు.
ఈ సందర్భంగా కోటి మందికిపైగా పిల్లలు తమ మన్ కీ బాత్ ను పోస్టుకార్డుల ద్వారా పంపించారని మోదీ తెలిపారు. దేశవిదేశాల నుంచి వచ్చిన ఈ పోస్టుకార్డులు దేశ భవిష్యత్తుపై నవతరానికి ఉన్న దృక్పథాన్ని తెలుపుతున్నాయని చెప్పుకొచ్చారు. ఆ ఉత్తరాల్లో ఎంపిక చేసిన కొన్నింటి సారాంశాన్ని ప్రధాని మోడీ ఈ సందర్భంగా చదివి వినిపించారు. ఈ లేఖలు రాసిన వారంతా అవినీతి రహిత భారత్ ను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అవినీతిని నిర్మూలించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. విద్య, వైద్యాన్ని బలోపేతం చేయడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని మోడీ చెప్పారు.పద్మశ్రీ అవార్డులను పొందిన సామాన్యుల పేర్లను ప్రధాని తన ప్రసంగంలో ఉటంకించారు. కర్ణాటకకు చెందిన అమై మహాలింగ నాయక్ సహా పలువురు సామాన్యలు సమాజానికి చేసిన సేవలను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా జనవరి 23న ఓ నిమిషంలో తన చేతి మునివేళ్ళు, కాలి మునివేళ్ళు ఆధారంగా 109 పుష్ అప్స్ చేసి సి సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన మణిపూర్ కు చెందిన థౌనవోజమ్ నిరంజోయ్ సింగ్ (24)ని మోదీ ప్రశంసించారు. మన దేశంలో విద్య కేవలం పాఠ్య పుస్తకాలకు, తరగతి గదులకు మాత్రమే పరిమితమైనట్లు మనం చూడలేదన్నారు. మన గత చరిత్రను పరిశీలించినపుడు విద్యా రంగంతో అనుబంధంగలవారు అనేక మంది ఉన్నారని చెప్పారు. అన్ని రంగాలకు చెందిన అనేక మంది చాలా విద్యా సంస్థలను ఏర్పాటు చేశారని, విద్య వల్ల కలిగే ఆనందాన్ని ఇతరులు కూడా పొందాలనే ఆకాంక్షతో చాలా మంది వనరులను సమకూర్చారని చెప్పారు.
ఇక,దేశ జనాభాలో 75 శాతం మంది పెద్దలు కోవిడ్ వ్యాక్సిన్ లు తీసుకున్నట్లు మోదీ తెలిపారు. కోటిమందికి పైగా బూస్టర్ డోసులను కూడా అందుకున్నట్లు చెప్పారు. ఇప్పటిదాకా నాలుగున్నర కోట్ల మంది 15-18 సంవత్సరాల్లోపు పిల్లలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.