మూడు రోజుల యూరప్ పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సోమవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ నుంచి జర్మనీకి బయలుదేరి వెళ్లారు. ‘ప్రధాని మోదీ యూరప్ పర్యటన (PM Modi Europe Visit) తొలి అంకంగా బెర్లిన్‌కు వెళ్లారు, అక్కడ అతను భారత్-జర్మనీ సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు’ అని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) తెలిపింది.
ప్రధాని మోదీ మరికొద్ది గంటల్లో బెర్లిన్ చేరుకుంటారు. అక్కడ జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌తో కలిసి 6వ ఇండియా-జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్ (IGC)లో పాల్గొంటారు. ఇతర ఉన్నత స్థాయి పరస్పర చర్యలతో పాటు నార్డిక్ దేశాల నాయకులతో చర్చలు జరపడానికి ప్రధాని మోదీ మంగళవారం డెన్మార్క్‌ను సందర్శించనున్నారు. ఆయన పర్యటన బుధవారం పారిస్‌లో ముగుస్తుంది, అక్కడ ప్రధాని కొత్తగా ఎన్నికైన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కలుస్తారు.
ఉక్రెయిన్ పై రష్యా యుద్దం కారణంగా యూరప్ అల్లకల్లోలంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రధాని మోదీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. మోదీ యూరప్ టూర్ 65గంటలపాటు నిర్విరామంగా సాగనుంది. మొత్తం 25 సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఇంధన భద్రతతోపాటు యుద్ధనివారణా ఆయన పర్యటనలో ప్రధానాంశాలు కానున్నాయి. పర్యటనకు బయలుదేరే ముందు ఆదివారం సాయంత్రం ప్రధాని తన ఆలోచనలను ప్రజలతో పంచుకున్నారు..
ఉక్రెయిన్‌లో భీకర యుద్ధం జరుగుతోన్న వేళ యూరప్ దేశాల పర్యటనకు శ్రీకాంచుట్టారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఆదివారం సాయంత్రం జర్మనీ బయలుదేరడానికి ముందు తన పర్యటనపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ తాను యూరప్‌లో పర్యటిస్తున్నానన్నారు. యూరప్ దేశాలతో సహకార స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. శాంతి, శ్రేయస్సును కోరుకునే భారత్‌కు ఆయా దేశాలు ఎంతో ముఖ్యమైన భాగస్వామ్యపక్షాలు అని మోదీ అభిప్రాయపడ్డారు.
మూడు రోజులపాటు సాగే మోదీ యూరప్ పర్యటనలో ఇంధన భద్రతే ప్రధానాంశమని భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా తెలిపారు. వివిధ దేశాధిపతులతో మోదీ సంప్రదింపులు జరుపుతారని, ద్వైపాక్షిక చర్చలపైనే విస్తృతంగా దృష్టి సారించినప్పటికీ ఉక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితులు కూడా చర్చకు వస్తాయని పేర్కొన్నారు. మారిన భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇంధన భద్రతకు మరింత ప్రాధాన్యం ఏర్పడినందున ప్రధాని మోదీ చర్చల్లో ఈ అంశం ప్రధానంగా ఉంటుందని విదేశాంగ శాఖ అధికారి వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్ ఇప్పటికే స్పష్టమైన వైఖరిని అవలంబిస్తోందని, ఈ సంక్షోభాన్ని ఇరుదేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించినట్లు ఆయన గుర్తుచేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, Pm modi, Russia-Ukraine War