హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

INS Vikrant : శత్రుదేశాలకు చుక్కలే..తొలి స్వదేశీ యుద్ధనౌక INS విక్రాంత్ ను ప్రారంభించిన మోదీ

INS Vikrant : శత్రుదేశాలకు చుక్కలే..తొలి స్వదేశీ యుద్ధనౌక INS విక్రాంత్ ను ప్రారంభించిన మోదీ

 INS విక్రాంత్ ను ప్రారంభించిన మోదీ

INS విక్రాంత్ ను ప్రారంభించిన మోదీ

PM Modi Unveils Indian Navy new Ensign : రక్షణ రంగంలో భారత్ మరో మైలు రాయిని చేరింది. భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దేశపు తొలి స్వదేశీ విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్(INS Vikrant)ను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఇవాళ ప్రారంభించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

PM Modi Unveils Indian Navy new Ensign : రక్షణ రంగంలో భారత్ మరో మైలు రాయిని చేరింది. భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దేశపు తొలి స్వదేశీ విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్(INS Vikrant)ను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఇవాళ ప్రారంభించారు. కేరళలోని కొచ్చి షిప్ యార్డ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్,కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్,కేరళ సీఎం పిన్నరయి విజయన్ సహా పలువురు అధికారులు,నేతలు పాల్గొన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ రాకతో రక్షణ రంగంలో అగ్రశ్రేణి దేశాల సరసన నిలిచింది.

ఐఎన్ఎస్ విక్రాంత్‌ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.."కేరళ సముద్ర తీరం నుండి ప్రతి భారతీయుడు ఈ రోజు కొత్త భవిష్యత్తు యొక్క సూర్యోదయానికి సాక్షి అవుతున్నాడు. INS విక్రాంత్ పై ఈ వేడుక ప్రపంచలో భారతదేశం సత్తా,ధైర్యాన్ని చూపుతుంది. విక్రాంత్ పెద్దది, గొప్పది. విక్రాంత్ విలక్షణమైనది, విక్రాంత్ ప్రత్యేకమైనది. విక్రాంత్ కేవలం యుద్ధనౌక మాత్రమే కాదు...21వ శతాబ్దపు భారతదేశ కృషి, ప్రతిభ, ప్రభావం,నిబద్ధతకు నిదర్శనం. నేడు స్వదేశీ సాంకేతికతతో ఇంత పెద్ద విమాన వాహక నౌకలను నిర్మించే దేశాల సరసన భారతదేశం చేరింది. ఈరోజు ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశాన్ని కొత్త విశ్వాసంతో నింపింది. ఈ చారిత్రాత్మక సందర్భంగా ఇండియన్ నేవీకి, కొచ్చిన్ షిప్‌యార్డ్‌లోని ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే ఇటువంటి విమాన వాహక నౌకలను నిర్మించాయి. నేడు, భారతదేశం ఈ బ్యాచ్ లో చేరింది. అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి భారత్ మరో అడుగు వేసింది"అని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ INSVikrantలో కొత్త నౌకాదళ చిహ్నం 'నిషాన్'ను ఎగురవేశారు


ఐఎన్ఎస్ విక్రాంత్‌...స్వదేశంలో తయరుచేయబడిన తొలి యుద్ధ వాహక నౌక. 1971 యుద్ధంలో సేవలు అందించిన దేశ మొదటి విమాన వాహక నౌక.. ఐఎన్​ఎస్​-విక్రాంత్‌ పేరుతోనే దీనికి నామకరణం చేశారు. యుద్ధ వాహక నౌక అంటే.. యుద్ధ అవసరాలను బట్టి ఎయిర్‌బేస్‌గా ఉపయోగించుకునే నౌక. యుద్ధ సమయాల్లో దీనిపై ఫైటర్ జెట్స్‌ను మోహరించి శత్రు దేశాల ఫైటర్ జెట్స్‌ను, జలాంతర్గాములను టార్గెట్ చేయవచ్చు. యుద్ధ వాహక నౌక ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణించదు. దీని చుట్టూ విధ్వంసక నౌకలు, ఆయుధ సామాగ్రి మోసుకొచ్చే నౌకలు కూడా ఉంటాయి.

Covid Cases In India : భారత్ లో గత 24 గంటల్లో నమోదైన కోవిడ్ కేసులు,మరణాలివే

ఐఎన్ఎస్ విక్రాంత్... 262 మీ పొడవు, 62 మీ. వెడల్పు ఉంటుంది. ఇది రెండు హాకీ మైదానాలతో సమానం. ఐఎన్ఎస్ విక్రాంత్ బరువు 43 వేల టన్నులు ఉంటుంది. గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. అంటే గంటకు 51.8 కిలోమీటర్ల స్పీడుతో సముద్రంలో దూసుకెళ్లనుంది. MiG-29K, ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్ సహా ఒకేసారి దీనిపై 30 యుద్ధ విమానాల వరకు పార్క్ చేయవచ్చు. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో మొత్తం 14 అంతస్తులు 2300 కంపార్ట్‌మెంట్స్ ఉంటాయి. దాదాపు 1600 మంది సిబ్బంది ఉంటారు. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో అధునాతన ఫిజియోథెరపీ క్లినిక్, ఐసీయూ, లేబోరేటరీ, ఐసోలేషన్ వార్డులతో పూర్తి స్థాయి మెడికల్ కాంప్లెక్స్ అందుబాటులో ఉంది. 1971 యుద్ధంలో సేవలు అందించిన దేశ మొదటి విమాన వాహక నౌక.. ఐఎన్​ఎస్​-విక్రాంత్‌ పేరుతోనే దీనికి నామకరణం చేశారు.


కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో 2005లో విక్రాంత్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. నేవీ అంతర్గతసంస్థ అయిన వార్‌ షిప్‌ డిజైన్‌ బ్యూరో (డబ్ల్యూడీబీ) దీన్ని రూపొందించింది. 2009 నుంచి మొదలైన పూర్తిస్థాయి నిర్మాణం 13 ఏళ్లలో పూర్తయింది. దేశంలోని ప్రధాన పరిశ్రమలు, 100 చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ఐఎన్ఎస్ విక్రాంత్ విడి భాగాలు తయారయ్యాయి. బీఈఎల్, భెల్, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, జిందాల్, ఎస్‌ఆర్‌ గ్రూప్, మిథానీ, జీఆర్‌ఎస్‌ఈ, కెల్‌ట్రాన్, కిర్లోస్కర్, ఎల్‌ అండ్‌ టీ మొదలైన 550 దిగ్గజ పరిశ్రమలతో పాటు 100కు పైగా దేశీయ ఎంఎస్‌ఎంఈ(MSME)లు నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. పరికరాలు, యంత్రాలన్నీ దాదాపుగా స్వదేశీ తయారీవే. 26 వేల టన్నుల ఉక్కు, 2,500 కి.మీ. ఎలక్ట్రిక్‌ కేబుల్స్, 150 కి.మీ. పైపులు, 2 వేల వాల్వులు, గ్యాలీ పరికరాలు, ఎయిర్‌ కండిషనింగ్, రిఫ్రిజిరేషన్‌ ప్లాంట్లు, స్టీరింగ్‌ గేర్స్‌ వంటివన్నీ స్వదేశీయంగా తయారు చేసినవే. కొన్ని భాగాలను మాత్రం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. రెండువేల మంది షిప్‌యార్డు అధికారులు, సిబ్బంది, 13 వేలమంది కార్మికులు, ఉద్యోగులు విక్రాంత్‌ నిర్మాణంలో భాగస్వాములు. నౌక నిర్మాణం జరిగిన 13 ఏళ్ల పాటు రోజూ 2 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరికింది. పరోక్షంగా 13 వేల మందికి ఉపాధి లభించింది. 42,8000 టన్నుల సామర్థ్యంతో రెండు టేకాఫ్‌ రన్‌వేలు, ఒక ల్యాండింగ్‌ స్ట్రిప్‌లతో క్షిపణి దాడిని తట్టుకునేలా దీనిని నిర్మించారు. గత ఏడాది ట్రయల్స్‌ విజయవంతంగా ముగిశాయి.

First published:

Tags: Kerala, Pm modi

ఉత్తమ కథలు