రాజస్థాన్ లోని బర్మేర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన బస్సు దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక్కడి బర్మేర్-జోధ్ పూర్ హైవేపై ఓ ప్రైవేటు బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో బస్సులో మంటలు చెలరేగి మొత్తం 11 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మరో 20 మంది గాయపడ్డారు. బర్మేర్ జిల్లాలోని పచ్పద్రా గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
‘రాజస్థాన్లోని బర్మేర్-జోధ్పూర్ హైవేపై బస్సు-లారీ ఢీకొనడంతో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ దుఃఖ సమయంలో, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. బర్మేర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబీకులు రూ.2లక్షలు, గాయపడినవారికి రూ.50వేలు నష్టపరిహారం అందిస్తామని, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని బాధితులకు అందిస్తామని మోదీ పేర్కొన్నారు.
మొత్తం 25 మంది ప్రయాణికులతో ప్రైవేటు బస్సు ఇవాళ ఉదయం బలోత్రా నుంచి బయలుదేరింది. బర్మేర్-జోధ్ పూర్ హైవేపై పచ్పద్రా గ్రామం వద్ద.. ఎదురుగా దూసుకొచ్చిన లారీ ఢీకొనడంతో బస్సులో మంటలు రాజుకున్నాయి. క్షణాల్లోనే బస్సు దగ్ధమైపోయి అందులోని 11 మంది సజీవదహనం అయ్యారు. 20 మంది మాత్రం గాయాలతో బయటపడ్డారు.
బర్మేర్ బస్సు దుర్ఘటన సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంతం సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఎప్పటికప్పుడు అధికారులకు ఫోన్లు చేస్తూ వివరాలు అడిగితెలుసుకుంటున్నారు. సీఎం స్వయంగా ఆస్పత్రికి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. రోడ్డుపైనే బస్సు కాలిపోవడంతో హైవేపై కొన్ని గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తోన్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bus accident, Pm modi, Rajastan