పెట్రోల్ నుంచి అత్యవసర మందుల దాకా దాదాపు అన్ని సరుకుల ధరలు చుక్కలనంటి సామాన్యులు చుక్కలుచూస్తున్న తరుణంలో పేదలపై ప్రధాని మోదీ ఔదార్యం ప్రదర్శించారు. తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ పంపిణీని మరో ఆరు నెలలు పొడిగించారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో 2020 మార్చిలో ప్రారంభించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని మరోసారి పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
గరీబ్ కల్యాణ్ పథకం కింద తెల్ల రేషన్ కార్డు, అంతోద్యయ అన్న యోజన కార్డు, ఆహార పథకం కార్డు కలిగిన ఒక్కొక్కరికి నెలకు ఐదు కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తుండటం తెలిసిందే. ఈ పథకం మార్చి నెలతో ముగియనుండగా తాజాగా ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మరోసారి కేంద్రం పొడిగించింది. శనివారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నది.
గరీబ్ కల్యాణ్ పథకం పొడిగింపుపై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ట్వీట్ చేశారు. ‘భారతదేశ బలం దేశంలోని ప్రతి పౌరుడి శక్తిలో ఉంది. ఈ శక్తిని మరింత బలోపేతం చేయడానికి, సెప్టెంబర్ 2022 వరకు మరో ఆరు నెలల పాటు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 80 కోట్ల మందికి పైగా ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకుంటారు’ అని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
కాగా, దేశంలోని పేదలెవరూ కూడా ఆకలితో బాధపడకూడదన్న ఉద్దేశంతో ప్రపంచంలోనే అతి పెద్ద ఉచిత ఆహార పథకాన్ని ప్రధాని మోదీ మరోసారి ఆరు నెలలు పొడిగించారని కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దీంతో రూ.3.4 లక్షల కోట్ల విలువైన 1,003 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఈ పథకం కింద ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid, Free Ration, Garib kalyan ann yojana, Pm garib kalyan yojana, Pm modi