న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అజెండాను వివరించేందుకు శనివారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్లో రైతులకు వరాలు ప్రకటిస్తామని తెలిపారు. అంతేకాదు, కొంతకాలం కొత్త సాగు చట్టాల అమలుకు బ్రేక్ వేసేందుకు కూడా సిద్ధమని ప్రధాని ప్రకటించారు. కేంద్రం రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని, అన్ని అంశాలపై ఉభయ సభల్లో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతులతో మాట్లాడటానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, రైతుల అభ్యంతరాలను పరిశీలిస్తామని అఖిల పక్ష సమావేశంలో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కేంద్రం రైతులకు ఇచ్చిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉందని తెలిపారు.
రైతు సమస్యలు చర్చలతోనే పరిష్కారమవుతాయని మోదీ గుర్తుచేశారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి లోక్‌సభలో 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆందోళన బాట పట్టిన రైతన్నలకు ఊరట కలిగించే విధంగా బడ్జెట్ ఉండబోతోందనే చర్చ మొదలైంది. అంతేకాదు, రైతులకు ఉపశమనం కలిగించే విధంగా అతి తక్కువ వడ్డీకే రుణం పొందే సదుపాయాన్ని కేంద్రం బడ్జెట్లో పొందుపరిచినట్లు సమాచారం. ఇక.. పీఎం కిసాన్ పథకం ఉండనే ఉంది. దీంతో పాటు రుణ మాఫీ పథకాన్ని కూడా బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ రుణ మాఫీ పథకం ద్వారా దేశ రాజధాని వేదికగా ఆందోళన బాట పట్టిన రైతుల నమ్మకాన్ని తిరిగి పొందవచ్చనేది కేంద్రం భావనగా తెలుస్తోంది.
రైతుల ఆందోళన తలపెట్టినప్పటి నుంచి తెరపైకొచ్చిన ప్రధాన డిమాండ్లలో రుణ మాఫీ ఒకటి. దీంతో పాటు అగ్రికల్చరల్ క్రెడిట్ లోన్ స్కీమ్‌ను కూడా రైతులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రైతులలో కేంద్రంపై నమ్మకాన్ని మరింత పెంచుకోవచ్చనేది మోదీ సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. ఏదేమైనా పోరు బాట పట్టిన రైతన్నలు కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్ర బడ్జెట్ కూడా గతంలో ఎన్నడూ లేనంతగా వ్యవసాయానికి పెద్ద పీట వేసే అవకాశం ఉందనేది నిపుణుల అంచనా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers, Farmers Protest, Narendra modi, Pm modi