• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • PLANNED ANARCHY DEBUNKING FIVE MYTHS ABOUT FARMERS PROTESTS AFTER REPUBLIC DAY VIOLENCE BA GH

Farmers protest: రైతుల ఆందోళనపై ప్రజల్లో అపోహలు.. రాజకీయ పార్టీల పాత్రపై అనుమానాలు

Farmers protest: రైతుల ఆందోళనపై ప్రజల్లో అపోహలు.. రాజకీయ పార్టీల పాత్రపై అనుమానాలు

ఢిల్లీలో ఎర్రకోట వద్ద రైతులు (File)

కొత్త వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలని కొన్ని నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న రైతులు ఉద్యమాన్ని విస్తృతం చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున తలపెట్టిన టాక్టర్ల ర్యాలీ హింసకు దారితీసిన విషయం తెలిసిందే.

  • Share this:
కొత్త వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలని కొన్ని నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న రైతులు ఉద్యమాన్ని విస్తృతం చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున తలపెట్టిన టాక్టర్ల ర్యాలీ హింసకు దారితీసిన విషయం తెలిసిందే. కొంతమంది ప్రజలు ఈ చట్టాలను ఆమోదిస్తుండగా, మరికొంతమంది మాత్రం వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఎర్రకోట వద్ద జరిగిన హింసకు రైతులే బాధ్యత వహించాలని కొంతమంది రాజకీయ నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఇలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. ఈ ఘటనతో సంబంధం ఉందనే ఆరోపణలతో కొంతమంది రైతులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాజా ఆందోళనలపై ప్రజల్లో ఎలాంటి అనుమానాలు, అపోహలు నెలకొన్నాయి, రైతు సంఘాల ఆందోళనలు ఎంతవరకు ఆమోదయోగ్యం అనే విషయాలు పరిశీలిద్దాం.

చట్టాలను రైతులందరూ వ్యతిరేకిస్తున్నారా?
దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కొత్త వ్యవసాయ చట్టాలను, సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారనేది పెద్ద అపోహ. ఈ ఆందోళనలు ప్రధానంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల రైతులతో పాటు ప్రభుత్వాలు కూడా కనీస మద్దతు ధర వ్యవస్థ వల్ల ఎక్కువ లబ్ధి పొందాయి. దీంతో ప్రభుత్వ మార్కెట్ యార్డుల్లో ఏళ్లుగా పాగా వేసిన మధ్యవర్తులు, రాజకీయ నాయకులు రైతులను ఆందోళన చేసేలా, వాటిని కొనసాగించేలా ప్రోత్సహించారు. కానీ కనీస మద్దతు ధరతో రైతులందరికీ గిట్టుబాటు ధరలను ప్రభుత్వాలు అందించలేకపోయాయని నిపుణులు చెబుతున్నారు.

రైతుల ఆందోళనలో ఇంతకు ముందు హింస చోటుచేసుకోలేదా?
కొన్ని నెలల నుంచి రైతులు శాంతియుతంగా పోరాటాలు చేస్తున్నారని, ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగానే హింస చెలరేగిందని కొందరు చెబుతున్నారు. కానీ రైతుల పేరుతో కొన్ని రాష్ట్రాల్లో అల్లరి మూకలు ఎప్పటి నుంచో విధ్వంసాలకు పాల్పడుతున్నాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వేల సంఖ్యలో జియో టవర్లు కూల్చేశారు. రిలయన్స్ దుకాణాలను మూసివేయించారు. అదానీ గ్రూప్ ఉద్యోగులపై దాడులు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ట్రాక్టర్ల ర్యాలీలో వందల మంది పోలీసులపై ఆందోళనకారులు దాడి చేశారు. నిరసనకారులు చేసిన ఈ దాడుల వల్ల ఈ రెండు రాష్ట్రాల్లో కీలకమైన సమాచార, మౌలిక సదుపాయాలు గణనీయంగా దెబ్బతిన్నాయి.

రైతుల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదా?
కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి రైతులపై కఠినంగా వ్యవహరిస్తోందని చాలామంది చెబుతున్నారు. కానీ ఇది నిజం కాదు. నిరసనకారుల డిమాండ్లపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ముందు నుంచి ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకు రైతు సంఘాలతో ప్రభుత్వం 11 రౌండ్లు చర్చలు నిర్వహించింది. రాయితీలు ఇస్తామని, కొత్త సాగు చట్టాల అమలును 18 నెలల పాటు వాయిదా వేస్తామని ప్రతిపాదించింది. ప్రభుత్వ మార్కెట్లలో రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని, కనీస మద్దతు ధరల విధానాన్ని కొనసాగిస్తామని, దీనిపై లిఖిత పూర్వక హామీ కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రైతులకు చట్టపరంగా రక్షణ కల్పించే చర్యలు తీసుకుంటామని కూడా తెలిపింది. కానీ రైతు సంఘాలు మాత్రం చట్టాలను రద్దు చేయాల్సిందేనని మొండిగా డిమాండ్ చేస్తున్నాయి.

రైతు సంఘాలకు దేశంపై, రాజ్యాంగంపై భరోసా ఉందా?
తాము శాంతియుతంగానే నిరసనలు చేస్తున్నామని, దేశంపై, వ్యవస్థలపై ఎంతో గౌరవం ఉందని నిరసనకారులు చెబుతున్నారు. ఇదే నిజమైతే కేవలం గణతంత్ర దినోత్సవం రోజునే వారు ట్రాక్టర్ ర్యాలీకి ఎందుకు పిలుపునిస్తారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దేశ రాజధానిలో హింసాత్మక ఘటనలకు సంఘాల నేతలు కారణమయ్యారు. ట్రాక్టర్ ర్యాలీకి పోలీసులు అనుమతిచ్చారు. నిర్ణీత మార్గాల్లో ర్యాలీ చేసుకోవచ్చని చెప్పారు. కానీ పోలీసులపై దాడులు చేసి ఎర్రకోట వద్ద భారీ స్థాయిలో హింసకు పాల్పడ్డారు. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ముందు కూడా రైతు సంఘాల నేతలు హాజరు కాకుండా అన్ని వ్యవస్థలనూ అవమానించారు.

పూర్తిగా రైతుల నిరసనలేనా?
ఈ ఆందోళనల వెనుక రైతులు తప్ప ఎవరూ లేరని కొన్ని ఉద్యమ సంఘాలు ప్రకటించాయి. కానీ ఇది పూర్తిగా రైతుల నిరసనే అయితే, దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఈ ఆందోళనల్లో పాల్గొనాలి. ఒకవేళ దేశవ్యాప్తంగా నిరసనలకు రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు పిలుపునిస్తే ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయల ధరలతో పాటు ద్రవ్యోల్బణం కూడా భారీగా పెరిగేది. ఇవేవీ రైతు సంఘాలు గుర్తించకుండా రైతులను రెచ్చగొడుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ ఆందోళనల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు తెరవెనుక ప్రధాన పాత్ర పోషిస్తున్నందువల్లనే నిరసనలు ఇన్ని రోజుల వరకు సుదీర్ఘంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
Published by:Ashok Kumar Bonepalli
First published: