సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఫేస్ బుక్, ట్విటర్, యూట్యూబ్లో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విపరీతమైన వార్తలు చెలామణిలోకి వస్తున్నాయి. కేంద్రం ఈ పథకం కింద డబ్బులిస్తోంది. ఆ పథకం కింద నిధులు ఇస్తోంది. రాష్ట్రం ఫలానా పథకం కింద మహిళలకు, యువతకు డబ్బులిస్తోందంటూ ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవాలు ఎంత అనేది ఎంతమందికి తెలుసు. చాలా మంది అవగాహన రాహిత్యంతో ఇలాంటివి చేస్తున్నారు. మరికొందరు ఉద్దేశపూర్వకంగా కూడా చేస్తున్నారనే వాదన కూడా లేకపోలేదు. ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి కన్య వివాహ యోజన’ కింద యువతులు పెళ్లి చేసుకునే సమయంలో వారికి రూ.40,000 ఇస్తోందంటూ యూట్యూబ్లో ఓ వీడియో చెలామణి అవుతోంది. ఆ వీడియోకు సంబంధించిన సమాచారం కేంద్ర ప్రభుత్వానికి కూడా అందింది. ఈ క్రమంలో కేంద్ర ప్రచార సమాచార శాఖ దీనిపై వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం వద్ద అలాంటి పథకం ఏదీ లేదని స్పష్టం చేసింది.
‘కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కన్య వివాహ్ యోజన కింద పెళ్లి చేసుకునే సమయంలో యువతులకు రూ.40,000 ఇస్తోందంటూ యూట్యూబ్లో ప్రచారం జరుగుతోంది. ఇది పూర్తి అసత్యం. కేంద్ర ప్రభుత్వంలో అలాంటి పథకం ఏదీ అమలులో లేదు.’ అంటూ PIB Fact Check తెలిపింది.
दावा: #Youtube पर एक वीडियो में यह दावा किया जा रहा है कि केंद्र सरकार ‘प्रधानमंत्री कन्या विवाह योजना’ के तहत बेटियों को उनके विवाह के लिए ₹40,000 तक की धनराशि दे रही है।#PIBFactCheck: यह दावा फर्जी है। केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है। pic.twitter.com/P7gvmDKFJr
— PIB Fact Check (@PIBFactCheck) October 31, 2020
కాబట్టి, ఆ వైరల్ న్యూస్ పూర్తిగా ఫేక్ అని కేంద్రం స్పష్టం చేసింది. ఇదొక్కటే కాదు. ఇంకా చాలా విషయాలు ఇలా కేంద్ర, రాష్ట్రాల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. మీరు కూడా అలాంటివి ఏవైనా గమనిస్తే వెంటనే నమ్మొద్దు. ఓసారి దీనిపై క్లారిటీ తీసుకోవాలి. కేంద్ర ప్రచార సమాచార శాఖకు దీనిపై సమాచారం ఇస్తే వారు క్లారిటీ ఇస్తారు.
‘అమ్మాయిల పెళ్లికి సరైన వయస్సు నిర్ణయంపై ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీ చర్చలు జరుపుతోంది. కమిటీ ఏం సిఫారసులు చేసిందని దేశవ్యాప్తంగా పలువురు మహిళల నుంచి నాకు ప్రశ్నలు వస్తున్నాయి. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత సాధ్యమైనంత తొందరగా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది’ అని ప్రధాని మోదీ ఇటీవల పేర్కొన్నారు. దీంతోపాటు బడ్జెట్ ప్రసంగంలోనే దీనిపై ప్రకటన చేయగా.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో అమ్మాయిల పెళ్లి కనీస వయస్సు అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. మోదీ ప్రకటనల నేపథ్యంలో యువతుల పెళ్లికి కేంద్రం డబ్బులు కూడా ఇస్తుందనే ఆలోచన ప్రజల్లో నెలకొనే అవకాశం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fact Check, Pm modi