PETROL DIESEL PRICES WASNOT TIME TO BRING PETROL DIESEL UNDER GST SAYS UNION FINANCE MINISTER NIRMALA SITHARAMAN SK
Petrol diesel Prices: జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్..? కేంద్రం కీలక ప్రకటన..
ప్రతీకాత్మక చిత్రం
GST Council Meeting: స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలీవరి సేవలపై జీఎస్టీ వేస్తారంటూ వచ్చిన వార్తలపైనా నిర్మలా సీతారామన్ స్పందించారు. వినియోగదారులపై కొత్తగా ఎలాంటి పన్నూ వేయడం లేదని స్పష్టం చేశారు. గతంలో సంబంధిత రెస్టారెంట్ జీఎస్టీ చెల్లించేదని, ఇకపై అగ్రిగేటర్లు జీఎస్టీ చెల్లిస్తారని క్లారిటీ ఇచ్చారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol, diesel prices) మండిపోతున్నాయి. సెంచరీ దాటి ఇంకా పైకి పైకి పరుగులు పెడుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలను చూసి సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బైకులు, కార్లను బయటకు తీయాలంటేనే వణికిపోతున్నారు. ఐతే కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ గురించి దేశవ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్రం కృషిచేస్తోందని.. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ (GST) పరిధిలోకి తెస్తారని ఊహాగానాలు వినిపించాయి. అప్పుడు లీటర్ పెట్రోల్ రూ. 65-70 కే లభిస్తుందని ప్రచారం జరిగింది. ఐతే అందరూ అనుకున్నట్లుగానే శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం(GST Council Meeting)లో దీనిపై చర్చ జరిగింది. కానీ చర్చ..చర్చగానే మిగిలిపోయింది. అంతకు మించి ఒక్క అడుగు ముందుకు పడలేదు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేలేమని కేంద్రం స్పష్టం చేసింది.
పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి ఇది తగిన సమయం కాదని జీఎస్టీ మండలి అభిప్రాయపడినట్లుగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని కేరళ హైకోర్టు సూచించిన నేపథ్యంలో దాన్ని అజెండాలో చేర్చి సమావేశంలో చర్చించామని ఆమె వివరించారు.
This came on the agenda for discussion because of Kerala HC's order. HC had suggested that it be placed before GST Council. Members spoke very clearly that they wouldn't want it to be included in GST. Council said it wasn't time for them to bring petroleum products into GST: FM pic.twitter.com/HvSf4GcVh0
శుక్రవారం లక్నోలో 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. భేటీ ముగిసిన అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమె వెల్లడించారు. కొవిడ్ చికిత్సకు అవసరమైన ఔషధాలపై జీఎస్టీ తగ్గింపు డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఈ తగ్గింపు అమల్లో ఉండగా..దానిని డిసెంబరు 31 వరకు పొడిగించారు. ఇక క్యాన్సర్ సంబంధిత ఔషధాలపై ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సరఫరా చేసే బయో డీజిల్‌పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. సరుకు రవాణా వాహనాలకు రాష్ట్రాలు విధించే నేషనల్ పర్మిట్ ఫీజులను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఇక స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలీవరి సేవలపై జీఎస్టీ వేస్తారంటూ వచ్చిన వార్తలపైనా నిర్మలా సీతారామన్ స్పందించారు. వినియోగదారులపై కొత్తగా ఎలాంటి పన్నూ వేయడం లేదని స్పష్టం చేశారు. గతంలో సంబంధిత రెస్టారెంట్ జీఎస్టీ చెల్లించేదని, ఇకపై స్విగ్గీ, జొమాటో వంటి అగ్రిగేటర్లు జీఎస్టీ చెల్లిస్తారని క్లారిటీ ఇచ్చారు. అంతేతప్ప వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడబోదని స్పష్టం చేశారు. సమావేశంలో సభ్యులు వ్యతిరేకించిన అంశాన్ని కోర్టుకు నివేదిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు కేంద్రం ఆర్థికమంత్రి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.