కరోనా దెబ్బతో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. లాక్ డౌన్ తో ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. ఈ కోవిడ్ తెచ్చిన ఆర్థిక కష్టాలను ఎదుర్కోవడానికి పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని కేంద్రం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ పెరిగే మొత్తం లీటరుకు రూ. 3 నుంచి రూ. 6 వరకు ఉండొచ్చని అంచనా. కరోనా నేపథ్యంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కోలుకొనేందుకు కేంద్రం పలు ప్యాకేజీలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. వీటి నిర్వహణకు అదనపు ఆదాయం అవసరమవుతోంది. వాటిని సమకూర్చుకునేందుకు ఇంధన ధరలను పెంచక తప్పదని కేంద్రం భావిస్తోంది. అయితే గత నెల రోజులుగా ఇంధనాలపై ఎక్సైజ్ సుంకం పెంచలేదు. ఈ నేపథ్యంలో పెంచేందుకు ఇదే తగిన సమయమని కేంద్రం భావిస్తోంది. ఈ పెంపుతో ఏటా రూ. 60,000 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఎక్సైజ్ పై సుంకం పెంచేందుకు విధివిధానాలపై కేంద్రం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్లు తెలిసింది. త్వరలోనే ఈ అంశంపై ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది. మార్చిలో, పెట్రోల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 18 రూపాయలు, డీజిల్‌పై లీటరుకు 12 రూపాయలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ అనుమతి తీసుకుంది. అయితే ఆ సమయంలో ధరలను పెంచలేదు. కానీ మేలో పెట్రోల్ పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ను రూ. 12, డీజిల్‌పై రూ.9 పెంచింది. దీంతో పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 6, డీజిల్‌పై లీటరుకు రూ. 3 వరకు పెంచే వెసులుబాటు ఉంది. దీంతో ఇప్పుడు ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెరగడంతో ప్రభుత్వం ఈ ఏడాది చమురు ఆదాయాన్ని రూ. 1.75 లక్షల కోట్లకు పెంచాలని నిర్ణయించింది. మంగళవారం దేశంలోని వివిధ ప్రదేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల ధర రూ. 81.06 ఉండగా డీజిల్ ధర రూ. 70. 76గా ఉంది. ముంబాయిలో పెట్రోల ధర రూ. 87.74 ఉండగా, డీజిల్ ధర రూ. 76.86గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 84. 14 ఉండగా, డీజిల్ ధర రూ. 75.95 ఉంది. కోల్ కత్తాలో పెట్రోల్ ధర రూ. 82. 59 ఉండగా, డీజిల్ ధర రూ. 73. 99 గా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diesel price, Petrol price