PEOPLE WHO ARE ALIVE GETTING MESSAGES REGARING DEATH CERTIFICATES IN DELHI AK
మీ డెత్ సర్టిఫికెట్ రెడీ.. బతికున్న వ్యక్తులకు మెసేజ్‌లు.. ఏం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కంపెనీకి యజమాని అయిన వినోద్ శర్మ.. ఈ మెసేజ్ చూసి షాక్ అయ్యారు. మీ డెత్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయాలని అందులో ఉంది.
నిత్యం ఏదో ఒక పనిలో బిజీగా ఉండే మనకు మీ డెత్ సర్టిఫికెట్ సిద్ధమైందనే మెసేజ్ వస్తే ఎలా ఉంటుంది ? మనకు ఏ మాత్రం సంబంధం లేని ఈ రకమైన మెసేజ్ రావడం ఎవరికైనా షాక్ ఇవ్వడం ఖాయం. ఢిల్లీ వాసి వినోద్ శర్మకు ఇలాంటి ఊహించని అనుభవం ఎదురైంది. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అతడికి ఈ రకమైన మెసేజ్ వచ్చింది. ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కంపెనీకి యజమాని అయిన వినోద్ శర్మ.. ఈ మెసేజ్ చూసి షాక్ అయ్యారు. సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయాలని అందులో ఉంది. అయితే ఈ విషయాన్ని తమ వార్డు కౌన్సెలర్ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు.
తాను ఆ లింక్‌ను క్లిక్ చేయలేదని.. తన కుటుంబంలో ఈ మధ్యకాలంలో ఎవరూ చనిపోలేదని ఆయన తెలిపారు. అసలు తాను ఈ మధ్యకాలంలో ఎప్పుడూ డెత్ సర్టిఫికెట్ కోసం అప్లై చేయలేదని అన్నారు. తనకు ఈ మెసేజ్ నెల క్రితం వచ్చిందని తెలిపారు. దీనిపై ఆరా తీయగా అయా నగర్‌లోని రోహిత్ బైంసాలా అనే మరో వ్యక్తికి కూడా ఇదే రకమైన మెసేజ్ వచ్చినట్టు తేలింది. రోహిత్ తండ్రి రాజ్‌పాల్ గతేడాది డిసెంబర్లోచనిపోయారు. అయితే తన తండ్రి డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా అది రిజక్ట్ అయ్యింది.
అలా నాలుగుసార్లు జరిగింది. అయితే కొద్దిరోజుల క్రితం డెత్ సర్టిఫికెట్ కోసం మీరు చేసుకున్న దరఖాస్తు ఆమోదం పొందినట్టు అతడికి మెసేజ్ వచ్చింది. ఈ విషయం తెలియగానే స్థానిక కౌన్సెలర్.. ఎస్ఎండీసీలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ రకమైన భాషలో మెసేజ్‌లు రావొద్దని ఆయన అన్నారు. అయితే దీనిపై స్పందించిన ఎస్ఎండీసీ ఇది టెక్నికల్ సమస్య అని తెలిపింది. 15 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించింది.