మళ్లీ ప్యాసింజర్లకు చుక్కలు చూపిన ఎయిరిండియా

‘చెత్త’సేవలతో మరోసారి ప్రయాణీకులకు చుక్కలు చూపింది ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా.

news18-telugu
Updated: June 23, 2018, 5:56 PM IST
మళ్లీ ప్యాసింజర్లకు చుక్కలు చూపిన ఎయిరిండియా
ఎయిరిండియా విమానం(ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ-ఎయిరిండియా మరోసారి ప్రయాణీకుల సహనాన్ని పరీక్షించింది. ఎయిరిండియా సర్వర్ ఫెయిల్ కావడంతో పలు విమానాలు ఆలస్యమయ్యాయి. చెక్-ఇన్ సాఫ్ట్‌వేర్‌‌లో సమస్య ఉత్పన్నం కావడంతో ఢిల్లీ విమానాశ్రయంలో వందలాది మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక సమస్య కారణంగా విమానాలు ఆలస్యం కావడం ప్రయాణీకులకు చిరాకు తెప్పించింది.

సాంకేతిక సమస్య కారణంగా దేశ వ్యాప్తంగా 23 డొమస్టిక్, ఇంటర్నేషనల్ విమానాలు ఆలస్యమైనట్లు ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు. ఆలస్యమైన విమానాల్లో అత్యధికం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరాల్సిన విమానాలే ఉన్నట్లు తెలిపారు. సాంకేతిక సమస్య కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగినట్లు చెప్పారు. సాంకేతిక సమస్యను 15-30 నిమిషాల్లోపే సరిచేసినా...విమానాల రాకపోకలు పునరుద్ధరించేందుకు గంట-గంటన్నర సమయం పట్టిందని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి.

అయితే ప్రయాణీకులు దీనికి సంబంధించి మరో కథనాన్ని వినిపిస్తున్నారు. విమానాశ్రయం టెర్మినల్ లేదా విమానం లోపు గంటల తరబడి గడపాల్సిన దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తంచేశారు. విమానాల ఆలస్యానికి సంబంధించి తమకు ఎయిరిండియా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదని ఆరోపించారు. మొత్తానికి పలు విమానాలు షెడ్యూల్ మేరకు నడవకపోవడంతో ఢిల్లీ విమానాశ్రయం ప్రయాణీకులతో కిక్కిరిసిపోయింది. ప్రయాణీకులు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొందని వివరించారు.

ఎయిరిండియా సర్వర్ డౌన్ కావడంతో తమకు ఎదురైన చేదు అనుభవాన్ని పలువురు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఎయిరిండియా పనితీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. విమానాశ్రయం లోపల, విమానంలో వేచిచూస్తున్న ప్రయాణీకులకు కనీస సమాచారం ఇచ్చే సిబ్బంది కరువయ్యారంటూ కొందరు ప్రయాణీకులు మండిపడ్డారు.

First published: June 23, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>