ఇలాంటి స్నేహం ఎక్కడా చూసుండరు -అనాథ పిల్లలతో రామచిలుక దోస్తీ -ఆటపాటలతో మస్తీ

చిన్నారులతో చిలుక దోస్తీ

స్కూల్ పిల్లలతో రామచిలుక దోస్తీకి సంబంధించి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. అన్ కండీషనల్ లవ్ అని కొదరు, ఎల్లలు లేని గొప్ప బంధమని మరికొందరు, మీ స్నేహబంధం మా మదిని దోచేస్తోందని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు..

  • Share this:
ఆ చిట్టడవిలో.. పచ్చని చెట్ల మధ్య కొలువైన అనాథ, పేద బాలల విద్యా మందిరానికి.. క్రమం తప్పకుండా విశిష్ట అతిథిగారు వేంచేస్తుంటుంది.. పిల్లలంతా హాస్టల్ నుంచి స్కూలుకు నడుచుకుంటూ వెళ్లే మార్గంలో మాట కలిపి ముందుకు సాగుతుంది.. చిన్నారులు పాఠాలు వినే, చదువుకునే సమయంలో మాత్రం తనకూ పనున్నట్లు ఎక్కడికో ఎగిరిపోతుంది.. మళ్లీ సాయంత్రం బడి గంట కొట్టగానే ఠంచనుగా వచ్చేసి పిల్లలతో కలిసి ఆటలాడుకుంటుంది.. చీకటి పడగానే తన గూటికెళ్లి మళ్లీ ఉదయాన్నే కొత్త ముచ్చట్లు మోసుకొస్తుంది.. అవును.. ఆ అతిథి ఈ ఫొటోల్లో కనిపిస్తోన్న రామచిలుకే..

టీచర్లు గమనించినంత వరకు ఈ తంతు ఆరు నెలలుగా సాగుతోంది. పిల్లలు చెబుతున్న మాట మాత్రం.. ఆ రామచిలుక దాదాపు ఏడాదిగా వారితో స్నేహం చేస్తోంది. వారి అలౌకిక బంధానికి అడ్డు చెప్పని టీచర్లు అప్పుడప్పుడూ చిలుకను కూడా స్కూల్లోపలికి అనుమతిస్తుంటారు. పిల్లలు క్లాస్ రూమ్ బయటున్నారంటే చిలుక తనకు తానే వచ్చి వారి నెత్తినో, భుజానో వాలిపోతుంది..మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ సిటీలో హురావాలి రోడ్డుకు 2010లో దానికి సచిన్ టెండూల్కర్ రోడ్ అని పేరు మార్చారు. అక్కడి శార్దా బాలగ్రామ్ ఫారెస్టులోనే మన చిలుకగారు కొలువైఉంటారు. శారద బాలగ్రామ్ ట్రస్టుకు సమీపంలోనే రామకృష్ణా విద్యా మందిర్ ఉంది. అనాథ, పేద పిల్లల కోసమే ఏర్పాటైన శారద బాలగ్రామ్ లో బాలబాలికలు కలిపి 150 మంది ఉంటున్నారు. వాళ్లలో చిన్న పిల్లలు దగ్గర్లోని విద్యా మందిర్ లో చదువుతున్నారు. బాలగ్రామ్ నుంచి బడికి వెళ్లే దారిలోనే పిల్లలకు ప్యారెట్ తో స్నేహం కుదిరింది..

మధ్యప్రదేశ్ స్కూల్ పిల్లలతో రామచిలుక దోస్తీకి సంబంధించి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. అన్ కండీషనల్ లవ్ అని కొదరు, ఎల్లలు లేని గొప్ప బంధమని మరికొందరు, మీ స్నేహబంధం మా మదిని దోచేస్తోందని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. శార్దా బాలగ్రామ్ ఆశ్రమానికి అనుబంధంగా ఓ గోశాలను కూడా నిర్వహిస్తున్నారు. అక్కడ ఉత్పత్తి అయ్యే పాలను పిల్లలు తాగడానికి మాత్రమే వాడతారట. గూగుల్ లో sharda balgram gwalior అని టైప్ చేస్తే ఆ శరణాలయం గురించి మరింత సమాచారాన్ని పొందొచ్చు.
Published by:Madhu Kota
First published: