హత్య(Murder) కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి, తన భార్య(Wife)తో కాపురం చేసేందుకు రాజస్థాన్ హైకోర్టు 15 రోజుల పాటు పెరోల్ మంజూరు చేసింది. తనకు వారసులు కావాలని, పిల్లలను కనాలని, భర్తకు పెరోల్ ఇవ్వాలని కోరుతూ ఖైదీ భార్య కోర్టును ఆశ్రయించింది. దీనిపై రాజస్థాన్(Rajasthan) హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. భార్యతో కాంజుగల్ రిలేషన్స్ (Conjugal Relations) కొనసాగించేందుకు పెరోల్ ఇవ్వడాన్ని రాజస్థాన్ ప్రభుత్వం సవాలు చేస్తోంది. 2022 ఏప్రిల్ 5న జోధ్‌పూర్‌లోని రాజస్థాన్ హైకోర్టు డివిజన్ బెంచ్.. ఖైదీ తన భార్యతో సంతానం కోసం వైవాహిక సంబంధాన్ని కొనసాగించడాన్ని తిరస్కరించడం అనేది, అతని భార్య హక్కులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని పేర్కొంది. కోర్టు జీవిత ఖైదీకి 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు..
ఈ ఉత్తర్వులు రాజస్థాన్ ప్రిజనర్స్ రిలీస్ ఆన్ పెరోల్ రూల్స్, 2021(2021 రూల్స్)ని ఉల్లంఘిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేస్తోంది. ఖైదీ ప్రస్తుతం అజ్మీర్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. సెక్షన్లు 302 (హత్యకు శిక్ష), 34 (కామన్ ఇంటెన్షన్), ఆర్మ్స్ యాక్ట్‌లోని సెక్షన్‌ల సహా భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ నిబంధనల ప్రకారం చేసిన నేరాలకు అతను శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు ఆరు సంవత్సరాల జైలు(Jail) శిక్షను అనుభవించాడు. అతని భార్య సంతానం కోసం 15 రోజుల పెరోల్ కోసం అజ్మీర్‌లోని జిల్లా కలెక్టర్-కమ్-ఛైర్మన్, జిల్లా పెరోల్ కమిటీకి దరఖాస్తు పెట్టుకుంది. ఆ దరఖాస్తు పెండింగ్‌లో ఉండగా.. ఆమె రాజస్థాన్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
నిబంధనలకు విరుద్ధం
పెరోల్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ప్రతివాది ప్రక్రియను కూడా అనుసరించలేదని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మొదట జైలు సూపరింటెండెంట్‌ను సంప్రదించాలని, అయితే ఆమె వెంటనే జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించిందని పేర్కొంది. విధానపరమైన లోపాలు ఉన్నప్పటికీ, హైకోర్టు, రాజస్థాన్ ఖైదీల విడుదలపై పెరోల్ రూల్స్, 2021కి విరుద్ధంగా, రిట్ పిటిషన్‌ను అనుమతించి, ప్రతివాదిని పదిహేను రోజుల పాటు పెరోల్‌పై విడుదల చేయాలని ఆదేశించడాన్ని తప్పుబడుతోంది. SLP 2021 నియమాలలోని సెక్షన్ 16 (1).. పెరోల్‌పై ఖైదీలను విడుదల చేయడానికి అనర్హులను పేర్కొంటుంది. ఒక ఖైదీ దోషిగా నిర్ధారణ అయితే.. శిక్షలో సగం శిక్షను ఉపశమనంతో సహా అనుభవిస్తే తప్ప పెరోల్‌పై విడుదల చేయలేరని నియమాలు ఉన్నాయి.
బాధితుల హక్కులు పట్టించుకోలేదు
2021 నిబంధనలలోని సెక్షన్ 17(డి) ప్రకారం.. జీవిత ఖైదు పడిన వ్యక్తి 20 సంవత్సరాలు శిక్ష అనుభవించాలి. ప్రతివాది కేవలం 6 సంవత్సరాల, 6 నెలల శిక్షను అనుభవించాడు. అతను పెరోల్ పొందేందుకు అనర్హుడని ప్రభుత్వం చెబుతోంది. అలాగే ఎమర్జెన్సీ కేసుల్లో పెరోల్ మంజూరు చేయవచ్చని, సెక్షన్ 11లో వివరాలు స్పష్టంగా ఉన్నాయని, వీటిని పక్కనపెట్టి అదనపు పరిశీలనల ఆధారంగా హైకోర్టు ఏకపక్షంగా ఆదేశాలు ఇచ్చిందని వాదించింది.
నేరస్థుడి భార్యకు బిడ్డపై ఉన్న హక్కుపై ఆధారపడి, దోషి నేరానికి గురైన బాధితుల హక్కులను పూర్తిగా విస్మరిస్తూ, పెరోల్‌పై దోషిని విడుదల చేస్తూ హైకోర్టు ఏకపక్ష ఉత్తర్వును జారీ చేసిందని కూడా చెప్పింది. ఏప్రిల్‌లో జారీ చేసిన రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని అప్పీల్ కోరింది. మధ్యంతర ప్రార్థన ద్వారా, అప్పీలుదారు హైకోర్టు ఆర్డర్‌పై స్టేను కూడా కోరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP High Court, Murder case, Rajastan, Wife