పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు..ఈ అంశాలపైనే ప్రత్యేక ఫోకస్

ప్రతీకాత్మక చిత్రం

Parliament Winter Session 2019 | గత ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాలను డిసెంబర్‌ 11న ప్రారంభించి జనవరి మొదటి వారం వరకు నిర్వహించారు. ఈసారి దాదాపు నెల రోజుల ముందే శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

  • Share this:
    పార్లమెంటు శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారయ్యింది. పార్లమెంటు సమావేశాలు నవంబర్‌ 18న ప్రారంభమై డిసెంబరు 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉభయ సభల కార్యదర్శులకు అధికారిక సమాచారమిచ్చింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో గత వారం సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ పార్లమెంటు శీతాకాల సమావేశాల షెడ్యూల్‌పై చర్చించి..ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గత ఏడాది శీతాకాల సమావేశాలను డిసెంబర్‌ 11 నుంచి జనవరి మొదటి వారం వరకు నిర్వహించారు. ఈసారి దాదాపు నెల రోజుల ముందే శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

    ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. మరీ ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆర్థిక మాంధ్యం ప్రభావాన్ని అధిగమించేలా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు రాయితీలు ప్రకటించింది. అయితే మోదీ సర్కారు ఆర్థిక విధానాల కారణంగానే ప్రస్తుతం దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొంటోందని కాంగ్రెస్ తదితర విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బ్యాంకింగ్, వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిపై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు యోచిస్తున్నాయి.

    అలాగే జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై పార్లమెంటు వేదికగా అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం జరిగే అవకాశముంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) అంశంపై కూడా సభలో వాడివేడి చర్చ జరగనుంది. అసోంలో అర్హులైన వారికి కూడా ఎన్ఆర్సీలో చోటు దక్కలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
    First published: