Parliament Moonsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు(Parliament Moonsoon Session)కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 18 నుంచి ప్రారంభమయ్యే అవకాశమున్నది. నెలరోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాలు ఆగస్టు 12న ముగియనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ కమిటీ(CCPA)సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాబోయే సెషన్‌కు 17 పని దినాలు ఉండే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా,ప్రస్తుత పార్లమెంటు భవనంలో జరిగే చిట్టచివరి సమావేశాలు కూడా ఇవేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022 శీతాకాల సమావేశాలు కొత్త భవనంలో జరుగుతాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించిన విషయం తెలిసిందే.
మరోవైపు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులకు వర్షాకాల సమావేశాల సమయంలోనే ఎన్నికలు జరగనున్నాయి. జులై 18న రాష్ట్రపతి ఎన్నిక(President Election)జరుగుతుంది. ఆగస్టు 10తో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ పదవీకాలం కూడా ముగుస్తుంది. దీంతో ఈ పదవికి కూడా వర్షాకాల సమావేశాల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రత్యేకం కానున్నాయి.
ఇక,ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం అనేక బిల్లులను సభలో ప్రవేశపెట్టవచ్చు. బడ్జెట్ సెషన్‌లో పార్లమెంటరీ కమిటీకి పంపిన 4 బిల్లులు వీటిలో ఉన్నాయి.ఇక,ఈ సమావేశాల్లో . ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మరియు ఇతర ముఖ్యమైన సమస్యలపై, రాహుల్, సోనియాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్య సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్దమవుతున్నాయి.
Air Pollution : భారతీయుల ఆయుష్షు ఐదేళ్లు కట్..ఢిల్లీలో ఉండేవాళ్లకైతే 10 ఏళ్లు!
మరోవైపు,రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలిపే దిశగా వ్యూహాలు రచిస్తున్న బెంగాల్ సీఎం మమతాబెనర్జీ... బుధవారం ఢిల్లీలో పలు పార్టీలతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ భేటీకి రావాలంటూ ఆమె ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన 22 మంది జాతీయ స్థాయి నేతలకు ఆహ్వానాలు పంపారు. మమత నిర్వహించే భేటీలో పాల్గొనేందుకు శరద్ పవార్ మంగళవారమే ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం ఢిల్లీలో శరద్ పవార్ తో భేటీ అయిన మమత పలు అంశాలపై ఆయనతో చర్చలు జరిపారు. శరద్ పవార్ ఇంటిలో జరిగిన ఈ సమావేశంలో బుధవారం సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, భేటీకి హాజరయ్యే పార్టీల వైఖరి తదితరాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో నిలిచే అంశంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన శరద్ పవార్‌ను మమతా బెనర్జీ స్వయంగా కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రపతి అభ్యర్థిగా తాను పోటీ చేయనంటూ పవార్ ప్రకటించిన నేపథ్యంలో... ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని పవార్‌ను దీదీ అభ్యర్థించినట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian parliament, Monsoon session Parliament, Parliament, President Elections 2022