ఏడాదికిపైగా సాగిన రైతు ఉద్యమం (Farmers Protest) ఫలితంగా మూడు వ్యవసాయ చట్టాలను (3 Farm Laws) రద్దు చేసుకున్న మోదీ సర్కారు.. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) (MSP) విషయంలో ఆలస్యంగానైనా కీలక అడుగు వేసింది. ప్రధాని మోదీ రైతులకు క్షమాపణలు చెప్పి, ఎంఎస్పీకి చట్టబద్ధత (MSP Guarantee Act) కల్పిస్తామని హామీ ఇచ్చిన 8 నెలల తర్వాతగానీ ఆ దిశగా కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే కమిటీలోని సభ్యులు, దాని అజెండాలోని అంశాలపై రైతు సంఘాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వివరాలివే..
దేశంలో సాగు సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం.. వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలన్న రైతు సంఘాల డిమాండ్‌పై కేంద్రం 8 నెలల తర్వాత స్పందిస్తూ కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ఈ నెల 12న రహస్య నోటిఫికేషన్ జారీ చేయడం, ఆ విషయాన్ని ఆలస్యంగా ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో ప్రకటించడం చర్చనీయాంశమైంది.
మొత్తం 29 మంది సభ్యులుండే అగర్వాల్ కమిటీ పంటకు కనీస మద్దతు ధర చట్టబద్ధతతోపాటు ప్రకృతి సేద్యం, పంటల మార్పిడి వంటి అంశాలపైనా దృష్టి సారిస్తుంది. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ వ్యవస్థను బలోపేతం చేసే అంశాన్నీ పరిశీలిస్తుంది. ఈ కమిటీలోకి సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)కు చెందిన ముగ్గురికి కూడా చోటు కల్పించింది. అయితే కేంద్రం నిబద్ధతపై రైతు సంఘాటు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
అగర్వాల్ కమిటీ అజెండాలోని అంశాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, మొత్తం 29 మంది కమిటీ సభ్యుల్లో కేంద్ర ప్రభుత్వానికి చెందినవారి సంఖ్యే 21గా ఉందని, రైతు ప్రతినిధుల సంఖ్యను 8గా పేర్కొన్నప్పటికీ అందులో ఐదుగురు రైతుల పేరుతో ఉన్న బీజేపీ ప్రతినిధులేనని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. అగర్వాల్ కమిటీ అజెండాలోని మూడు అంశాలపై ఇప్పటికే వేరే కమిటీలు ఏర్పాటై ఉండగా రద్దైన వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకొచ్చే దిశగానే కేంద్రం అడ్డదారిలో ప్రయత్నాలు చేస్తున్నదని రైతు సంఘాల నేత రాకేశ్ టికాయత్ ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crops, Farmers, Farmers Protest, MSP, Union government