Parliament Monsoon Session 2021: 31 బిల్లులు.. 6 ఆర్డినెన్సులు... వేదిక కాబోతున్న పార్లమెంట్.. నేటి నుంచే సమావేశాలు

పార్లమెంటు భవనం

Parliament Monsoon Session 2021: ఈసారైనా సమావేశాలు అర్థవంతంగా సాగుతాయా? చూస్తుంటే అలాంటి అవకాశాలు లేనట్లే కనిపిస్తోంది. పెట్రోల్ ధరలు, రైతుల సమస్యలను ప్రతిపక్షాలు లేవనెత్తనున్నాయి.

  • Share this:
    Parliament Session 2021: పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడూ జరిగేవే. కానీ ఈసారి ప్రత్యేకమైనవి. కేంద్ర ప్రభుత్వంపై ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయి. ప్రతిపక్షాలు చాలా దూకుడుగా ఉన్నాయి. కేంద్రాన్ని చాలా అంశాలపై నిలదీస్తామంటూ సిద్ధంగా ఉన్నాయి. ప్రతి అంశంపైనా చర్చకు సిద్ధమే అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయినా సరే... ఎలాగైనా తమ పట్టు చూపించాలని విపక్షాలు ఆవేశంతో ఉన్నాయి. వైరిపక్షాలు ఏం చేసినా ఆధారాలతో సహా ఆరోపణలను ఖండించాలని కేంద్రం సమాయత్తమైంది. అందువల్ల ఈసారి సమావేశాలు కూడా కాస్తంత ఆందోళనలు, నిరసనల మధ్యే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేటి ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

    ఈసారి సమావేశాల్లో మొత్తం 31 బిల్లులు చర్చకు రానున్నాయి. వీటిలో రెండు ఆర్థిక అంశాలకు చెందినవి. మిగతా 29లో ఆరు ఆర్డినెన్సులు ఉన్నాయి. వాటిని బడ్జెట్ సమావేశాల తర్వాత కేంద్రం జారీ చేసింది. వాటిని కచ్చితంగా పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్లహ్లాద్ జ్యోషీ... నిన్నటి అఖిలపక్ష సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. దేశంలో కరోనా, సెకండ్ వేవ్ సమస్యలు, రైతుల ఆందోళనలు, సమాఖ్య వ్యవస్థకు సమస్యలు, ఆప్ఘనిస్థాన్‌తో సంబంధాలు, చైనాతో సరిహద్దు సమస్యలపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అర్థవంతమైన చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జ్యోషీ తెలిపారు.

    ఈసారి సమావేశాల్లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు ఉంటారు. వీలైనంత ఎక్కువ సేపు సభల్లో ఉండి... వ్యవహారాలు నేర్చుకోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారికి సూచనలు చేశారు. అన్ని అంశాలపైనా చర్చిస్తామని ప్రధానమంత్రి తెలిపారు. అఖిలపక్ష సమావేశం తర్వాత... విపక్షాలు మరో మీటింగ్ పెట్టుకున్నాయి. సభలో ఎలా వ్యవహరించాలి... ఎలా కేంద్రాన్ని నిలదియ్యాలి అనే అంశంపై చర్చించుకున్నాయి. ఇందులో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఆర్ఎస్పీ, ఐయూఎంఎల్, శివసేన, ఆప్ పాల్గొన్నాయి.

    ఇది కూడా చదవండి: Video: మాస్క్ లేకుండా రైలు ఎక్కాడు... బలవంతంగా బయటకు నెట్టేసిన ప్రయాణికులు

    ప్రధానంగా రైతుల సమస్యపై చర్చించాలని చాలా పార్టీలు వాయిదా తీర్మానాలను రెండు సభల్లో ఇచ్చాయి. కాబట్టి నేటి సమావేశాల్లో రైతుల సమస్యపై ప్రతిపక్షాలు ఆందోళన చేసే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం ఇప్పటికిప్పుడు రైతుల అంశంపై చర్చించేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. మరోవైపు సెంచరీ దాటేసిన పెట్రోల్ ధరలపై, సెకండ్ వేవ్ విజృంభణపై ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకుపడేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

    రెండు సభల్లో టైమింగ్స్:
    ఈసారి లోక్ సభ, రాజ్యసభ రెండూ కూడా ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తాయి. మొత్తం 19 సార్లు సమావేశాలు జరుగుతాయి. ఆగస్టు 13న ముగుస్తాయి. కరోనా జాగ్రత్తలు ఎలాగూ తీసుకుంటారు.
    Published by:Krishna Kumar N
    First published: