Agriculture Bills: విపక్షాల ఆందోళన మధ్యే.. వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం..

విపక్షాల ఆందోళన మధ్యే.. వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం..

రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయకల్పన) బిల్లు-2020, ధరల హామీ, పంట సేవల అంగీకార బిల్లు-2020, నిత్యవసర ఉత్పత్తుల (సవరణ) బిల్లు-2020లకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోద ముద్రవేశాయి.

  • Share this:
    వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోద ముద్రవేసింది. విపక్షాల ఆందోళనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లులు పాసయినట్లు డిప్యూటీ ఛైర్మన్ ప్రకటించారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేశారు. అంతకుముందు రాజ్యసభలో రచ్చ రచ్చ జరిగింది. కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సభలో బిల్లులను ప్రవేశపెట్టిన వెంటనే విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. రైతులకు నష్టం చేకూర్చి కార్పొరేట్లకు లాభం కలిగించే ఈ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ వెల్‌లోకి వెళ్లి డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్‌ ముందు రూల్ బుక్ ప్రదర్శించారు. మరో ఎంపీ రూల్ బుక్ విసిరేస్తే డిప్యూటీ ఛైర్మన్‌ మైక్‌పడి పడింది.

    మరికొందరు సభ్యులు బిల్లు ప్రతులను చింపేసి విసిరేశారు. కొందరు డిప్యూటీ ఛైర్మన్ మైక్‌లను లాగేందుకు ప్రయత్నించారు. కరోనా సమయంలో ఇలా వెల్‌లోకి రావడం మంచిది కాదని.. అందరూ తమ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని విజ్ఞప్తి చేసినప్పటికీ ఎంపీలు వినలేదు. గందరగోళం మధ్య సభను కాసేపు వాయిదా వేశారు డిప్యూటీ ఛైర్మన్. అనంతరం సభ ప్రారంభమైన తర్వాత.. విపక్షాల నినాదాల మధ్యే మూజువాణి ఓటు నిర్వహించి బిల్లులకు ఆమోద ముద్రవేశారు.

    వ్యవసాయ బిల్లుకు బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు, వైసీపీ మాత్రమే మద్దతు తెలిపాయి. కాంగ్రెస్, బీజేపీ మిత్రపక్షమైన అకాలీదళ్‌, శివసేన, టీఆర్ఎస్, అన్నాడీఎంకే, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, ఆమాద్మీ పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి. బిల్లును ఇంత హడావిడిగా పాస్ చేయాల్సిన అవసరం ఏముందని.. సెలెక్ట్ కమిటీకి పంపాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ బిల్లులతో రైతులకు మరణ శాసనం రాస్తున్నారని విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఐనా కేంద్రం మాత్రం వినలేదు. తమ పని తాను చేసుకుంటూ వెళ్లింది.

    వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను సెప్టెంబర్ 14న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయకల్పన) బిల్లు-2020, ధరల హామీ, పంట సేవల అంగీకార బిల్లు-2020ను మూజువాణి ఓటుతో ఈ నెల 17న లోక్‌సభ ఆమోదించింది. ఇక తృణధాన్యాలు, పప్పులు, ఉల్లిపై నియంత్రణ ఎత్తివేసే.. నిత్యవసర ఉత్పత్తుల (సవరణ) బిల్లు-2020ను మంగళవారం ఈనెల 15న ఆమోదించింది. తాజాగా రాజ్యసభ కూడా ఆమోద ముద్రవేయడంతో బిల్లులు రాష్ట్రపతి వద్దకు వెళ్లనున్నాయి. ఆయన ఆమోదిస్తే చట్ట రూపం దాల్చుతాయి.

    మరోవైపు ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానాలో రైతులు రోడ్డెక్కారు. కోవిడ్ నిబంధనలను పక్కనబెట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. పంజాబ్, హర్యానా నుంచి రైతులు దేశరాజధాని ఢిల్లీలోకి ప్రవేశించకుండా.. సరిహద్దులను మూసివేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published: