పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు (Budget session) నేడు ప్రారంభమవుతున్నాయి. మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగాయి. రెండో విడత సమావేసాలు ఏప్రిల్ 6 వరకూ కొనసాగనున్నాయి. మొదటి విడతలో.. కేంద్రం బడ్జెట్‌ని ప్రవేశపెట్టింది. అలాగే... రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చించింది. ఇక రెండో విడతలో... కేంద్ర బడ్జెట్ ఆమోదంపై చర్చ, గ్రాంట్లపై చర్చ జరుగుతుంది.
షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు లోక్‌సభ, రాజ్యసభ ప్రారంభమవుతాయి. మొదటి విడత లాగానే... రెండో విడత సమావేశాలు కూడా గందరగోళం మధ్య సాగేలా కనిపిస్తున్నాయి. ప్రధానంగా వ్యాపారవేత్త అదానీ (Adani Group)పై వస్తున్న ఆరోపణలు, ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా జరుగుతున్న దాడులు, పెరిగిపోతున్న ధరలు, పడిపోతున్న రూపాయి విలువ, నిరుద్యోగం వంటి అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి విడత సమావేశాల్లో.. అదానీ - హిండెన్ బర్గ్ వివాదంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPG) ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రెండో విడతలోనూ ఇదే డిమాండ్‌తో ముందుకొస్తోంది. కేంద్రం మాత్రం... ఫైనాన్స్ బిల్లు ఆమోదంపైనే ఫోకస్ పెడుతోంది.
ప్రధానంగా కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించట్లేదనీ, కేంద్ర ప్రభుత్వ చెప్పుచేతల్లో నడుస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందువల్ల ఈ అంశంపై విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. అందువల్ల బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా సాగే అవకాశాలు కనిపించట్లేదు. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు ప్రతిపక్ష నేతలకు సమస్యగా మారుతున్నాయి. లేని కేసుల్లో తమను ఇరికించి.. దర్యాప్తు పేరుతో ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్న ఎంపీలు.. తమ వాదన వినిపించేందుకు పార్లమెంట్‌నే వేదికగా మార్చుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2023, Indian parliament