Pro-Pakistan Slogans: ఆ పార్టీ ర్యాలీలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు.. సీఎం తీవ్ర ఆగ్రహం

సమాజ్‌వాదీ పార్టీ ర్యాలీ

పాకిస్తాన్ నినాదాలు చేసిన వ్యక్తులకు సమాజ్‌వాదీ పార్టీతో సంబంధం లేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. తనకు, పార్టీని అప్రతిష్ట పాలు చేసేందుకే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ర్యాలీలో చొరబడి పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారని ఆరోపించారు.

  • Share this:
    సమాజ్‌వాదీ పార్టీ కార్యక్రమంలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడం ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. జులై 15న ఆగ్రాలో సమాజ్‌వాదీ పార్టీ నేతలు యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, అక్రమాలకు పాల్పడిందని నిరసన చేపట్టారు. ఐతే ఆ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేశారు. ఎరుపు రంగు చొక్కా ధరించిన ఓ వ్యక్తి మొదట పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడంతో.. ఆ తర్వాత మరికొందరు అతడిని అనుసరించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీడియో ట్విటర్‌లో పోస్ట్ చేసి విరుచుకుపడింది. సమాజ్‌వాద్ పార్టిని పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారా? అంటూ మండిపడింది.



    ఈ వ్యవహారంపై సమాజ్‌వాదీ పార్టీ ఆగ్రా నగర అధ్యక్షుడు వాజిద్ నిస్సార్ స్పందించారు. పాకిస్తాన్ నినాదాలు చేసిన వ్యక్తులకు సమాజ్‌వాదీ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. తనకు, పార్టీని అప్రతిష్ట పాలు చేసేందుకే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ర్యాలీలో చొరబడి పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారని ఆరోపించారు. నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు బీజేపీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఆరిఫ్ ఖాన్, పంకజ్‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఐతే తాను రాజ్‌పుత్ ఫ్యామిలీకి చెందినవాడినని.. తానెందుకు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తానని పంకజ్ సింగ్ అన్నారు.



    అటు సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా సమాజ్‌వాదీ పార్టీపై మండిపడ్డారు. ఆ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌కు మతి భ్రమించిందని విరుచుకుపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ అసలు రంగంటే ఇప్పుడు బయటపడిందని ధ్వజమెత్తారు. కాగా, వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటి నుంచే పోటాపోటీగా ప్రజాక్షేత్రంలో తిరుగుతూ... రాష్ట్ర రాజకీయాను వేడెక్కిస్తున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: