భారత్-పాకిస్థాన్ యుద్ధం తప్పదా... రెచ్చిపోతున్న ఇమ్రాన్‌ఖాన్...

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

Jammu and Kashmir : ఇప్పుడిప్పుడే జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులు అదుపులోకి వస్తుంటే... చిచ్చు రాజేస్తున్నారు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు... ఆయనలోని అసహనాన్ని బయటపెడుతున్నాయా?

  • Share this:
ఇండియాతో శాంతి చర్చలు వేస్ట్... యుద్ధం చెయ్యడమే కరెక్ట్... తాడో పేడో తేలిపోవాలి... సమరానికి సన్నద్ధం కావాలి... ఇవీ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తాజా డైలాగ్స్. గట్టిగా మన తెలుగు రాష్ట్రాలంత దేశం పాకిస్థాన్. అలాంటిది దాని కంటే పది రెట్లు పెద్దగా ఉండే ఇండియాతో పెట్టుకోవడానికి రెడీ అయిపోతోంది. ప్రపంచంలో ఉన్న ప్రతీ దేశానికీ తెలుసు... యుద్ధం జరిగితే... చిత్తైపోయేది పాకిస్థానే అని. అయినప్పటికీ కయ్యానికి కాలు దువ్వుతున్నారు ఇమ్రాన్ ఖాన్. చెప్పాలంటే యుద్ధం చేసేంత ఆర్థిక పరిస్థితి పాకిస్థాన్‌కి లేదు. నిండా అప్పులు... అమెరికా లాంటి దేశంపై ఆధారపడి బతికే పరిస్థితి. విపరీతమైన కరవు, ఆకలి చావులు, నిరుద్యోగం, ఉగ్రవాదం... ఇలా పాకిస్థాన్ పరిస్థితి దయనీయంగా ఉంటే... దాన్ని సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టడం మానేసి... సమరానికి సై అనడం ఎంతవరకూ సరి అన్న ప్రశ్న తలెత్తుతోంది. యుద్ధం... యుద్ధం అంటూ ఇమ్రాన్‌ఖాన్ గింజుకున్నంత మాత్రాన... కలిగే ప్రయోజనం ఏమీ ఉండదన్న విషయం ఆయనకు తెలియదని అనుకోలేం.

ఏదో పొడిచేద్దామని అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నించిన ఇమ్రాన్‌ఖాన్‌కి ఎక్కడా కలిసిరాలేదు. ఐక్యరాజ్యసమితిలో కుట్రపూరిత చర్చలను రష్యా తిప్పికొట్టింది. దాంతో... అమెరికాకు వెళ్లి... అక్కడ తేల్చేద్దామనుకుంటే... ట్రంప్ సర్కారు... నాకెందుకొచ్చింది అన్నట్లు ఉంటూనే... కావాలంటే మధ్యవర్తిత్వం వహిస్తామంటూ పాకిస్థాన్‌ను ఊరడించే ప్రకటనలతో సరిపెడుతోంది. ఇలా ఏం చేసినా బెడిసికొడుతుంటే... అసహనంతో రగిలిపోతున్న ఇమ్రాన్‌ఖాన్... నోటికొచ్చినట్లు రెచ్చగొట్టే డైలాగ్స్ పేల్చేస్తున్నారు.

చరిత్రలో భారత్-పాకిస్థాన్‌తో జరిగిన ఏ యుద్ధంలోనూ పాకిస్థాన్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు గనక యుద్ధం జరిగితే... భారత్ దాటికి తట్టుకోవడం పాకిస్థాన్ వల్ల కానే కాదు. జస్ట్ ఒక్క రోజు యుద్ధం జరిగినా... రెండు దేశాలకూ కొన్ని వందల కోట్లు ఖర్చవుతాయి. ఈ భారం నుంచీ భారత్ బయటపడగలదేమోగానీ... పాకిస్థాన్ వల్ల కాదు. అన్నీ తెలిసి కూడా న్యూయార్క్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్యూలో ఈ అధిక ప్రసంగం చేశారు ఇమ్రాన్ ఖాన్. తాను శాంతి చర్చలకు ప్రయత్నిస్తున్న ప్రతిసారీ భారత్... తమను తక్కువ అంచనా వేస్తోందని అన్నారు. రోజురోజుకూ రెండు దేశాల మధ్యా యుద్ధ వాతావరణం పెరుగుతోందనీ, ఆర్టికల్ 370 రద్దుపై తాడో పేడో తేల్చుకుంటామని అన్నారు. దీనిపై అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదన వినిపిస్తామన్నారు.

జమ్మూకాశ్మీర్ అంశం... భారత అంతర్గత వ్యవహారమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేసింది. అయినప్పటికీ... ఇమ్రాన్ ఖాన్... తన దేశంలో తనపై వస్తున్న వ్యతిరేకత, విమర్శల్ని ఎదుర్కొనేందుకు ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని అనిపిస్తోంది. యుద్ధమే చేసేంత సీన్ పాకిస్థాన్‌కి ఉండి ఉంటే... పుల్వామా దాడి తర్వాత... రెండు దేశాల మధ్యా తలెత్తిన ఉద్రిక్తలప్పుడే యుద్ధం జరిగివుండేది. అప్పట్లో భారత్ కాస్త దూకుడు ప్రదర్శించేసరికి... పాకిస్థాన్ సైలెంటైపోయింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న ఇమ్రాన్ సర్కార్... దాన్ని కూడా లాక్కుంటామని భారత ప్రభుత్వం ప్రకటించడంతో... అప్పటి నుంచీ అగ్గిమీద గుగ్గిలమవుతోంది.
First published: