Jammu Drone Attack: డ్రోన్లతో బాంబు దాడి.. జమ్మూ ఘటన వెనక పాకిస్తాన్ ఉగ్రవాదుల హస్తం.!

జమ్మూ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్

అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 14 కి.మీ. దూరంలోనే జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వైపు నుంచే డ్రోన్‌లు వచ్చి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు

 • Share this:
  జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడులు సర్వ సాధారణమే. ఎక్కడో ఒక చోట ఉగ్రవాదులు దాడి చేయడం, ఎన్‌కౌంటర్‌లు జరగడం వార్తల్లో వింటూనే ఉంటాం. ఐతే శనివారం రాత్రి జమ్మూ ఎయిర్ బేస్‌పై జరిగిన దాడి మాత్రం భద్రతా దళాలు ఉలిక్కిపడేలా చేసింది. ఎందుకంటే మనదేశంలో ఇంతకు ముందెన్నడూ అలాంటి దాడి జరగలేదు. ఉగ్రవాదులు దాడి చేయాలంటే.. నేరుగా వచ్చి కాల్పులు జరపడం, లేదంటే బాంబులు విసరడం వంటివి చేస్తుంటారు. కానీ తొలిసారి డ్రోన్‌లో బాంబులు నింపి.. వాటిని ఎయిర్ బేస్‌పై జార విడిచారు. జమ్మూలోని సత్వారీ ప్రాంతంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో శనివారం అర్ధరాత్రి 01.40 గంటల సమయంలో బాంబులు పేలాయి. గుర్తు తెలియని డ్రోన్లు తక్కువ ఎత్తులో ఎగరుకుంటూ వచ్చి ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో బాంబులు వేశాయి. ఓ బాంబును టెక్నికల్ ఏరియాలోని భవనంపై పడగా దాని పైకప్పుకు రంధ్రంపడింది. మరో బాంబు ఓపెన్ ఏరియాలో గ్రౌండ్‌పై నేలపై పడింది. 6 నిమిషాల వ్యవధిలోనే రెండు బాంబులు పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి.

  ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఉన్న విమానాలు, హెలికాప్టర్లే లక్ష్యంగా దాడులకు కుట్ర చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఎంఐ 17 హెలికాప్టర్లు, రవాణా విమానాలను భద్ర పరిచే హ్యాంగర్ల సమీపంలో బాంబులు పడడం, ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. దాదాపు కేజీన్నర బరువున్న ఐఈడీ బాంబును డ్రోన్‌లకు కట్టి ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో జార విడిచారు ముష్కరులు. ఆ శబ్ధాలు విన్న వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. గాయపడిన సిబ్బందిని ఆస్పత్రికి తరలించి.. లోపల అంతా పరిశీలించారు. ఓ భవనం పైకప్పు దెబ్బతింది. అంతకు మించి ఎలాంటి నష్టం జరగలేదు. ఐతే స్టేషన్ లోపల డ్రోన్‌కు సంబంధించిన శకలాలు లభించలేదు. ఈ లెక్కక అవి బాంబులను జారవిడిచి తర్వాత, తిరిగి వెళ్లిపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

  అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 14 కి.మీ. దూరంలోనే జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వైపు నుంచే డ్రోన్‌లు వచ్చి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను పరిశీలించారు. కౌంపౌండ్ వాల్‌పై ఉన్న సీసీ కెమెరాలు రోడ్డు వైపే తిరిగి ఉండడంతో డ్రోన్ల కదలికలు అందులో రికార్డు కానట్లుగా తెలుస్తోంది. డ్రోన్లను రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఆపరేట్ చేశారా? లేదంటే జీపీఎస్ ద్వారా నిర్దిష్ట గమ్యానికి పంపించారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇవి ఖచ్చితంగా పాకిస్తాన్ వైపు నుంచే వచ్చి ఉంటాయని.. దీని వెనక జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తముందని అధికారులు అనుమానిస్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉండే రాడార్లు డ్రోన్లను పసిగట్టలేవు. పక్షుల్లా చిన్నగా ఉండే డ్రోన్లను పసిగట్టేందుకు విభిన్నమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు.

  ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే జమ్మూలో ఓ వ్యక్తి నుంచి 6 కేజీల ఎల్‌ఈడీ బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జమ్మూలోని బనిహాల్ ప్రాంతంలో అతడిని అరెస్ట్ చేశారు. అతడికి ఆ డ్రోన్‌లకు ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. డ్రోన్‌ల దాడి ఘటన వెనక ఎవరున్నారో తేల్చేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఎయిర్‌ఫోర్స్ స్టేషనన్‌కు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. ఎయిర్‌ఫోర్స్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమికంగా ఆ డ్రోన్లు సరిహద్దు అవతలి నుంచే వచ్చినట్లు ఒక అంచనాకు వచ్చారు. ఘటనపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరాతీశారు. వైస్ ఎయిర్ చీఫ్, ఎయిర్ మార్షల్ హెచ్ఎస్ అరోరాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: