ఆర్టికల్ 370 రద్దుని జీర్ణించుకోలేని పాకిస్తాన్..భారత్‌ను రెచ్చగొడుతోంది. మిలటరీ, దౌత్య పరంగా ఎదుర్కోవడం చేతగాక..ఇప్పుడు ఉగ్రవాదులనే నమ్మకుంది. టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇచ్చి భారత్‌లో విధ్వంసాలకు కుట్రలు చేస్తోంది. అందుకోసం పీవోకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్)లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరో తోయిబాకు చెందిన ఉగ్రవాదులకు ఆగస్టు నుంచి శిక్షణ ఇస్తున్నారని...దీనికి జమాత్ ఏ ఇస్లామీ నేతృత్వం వహిస్తోందని వెల్లండించారు. దానికి సంబధించి పలు ఫొటోలను సైతం బయటపెట్టారు.
జమాత్ ఏ ఇస్లామీ మాజీ అధ్యక్షుడు ఇజాజ్ అఫ్జల్‌తో పాటు రావల్‌కోట్‌కు చెందిన జమాత్ ఏ ఇస్లామీ నేత అద్నాన్ రజాక్ ఆ ఫొటల్లో కనిపించారు. వీరు జైషే, హిజ్బుల్ టెర్రరిస్టులకు ఉగ్ర పాఠాలు బోధిస్తున్నారు. పోతి బాలా, తర్నూతి ప్రాంతాల్లోని రావల్‌కోట్ అడవుల్లో వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ క్యాంప్‌లను చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఒకే చోట ఎక్కువ కాలం ఉండకుండా...ప్రాంతాలను మార్చిమార్చి శిక్షణా శిబిరాలను కొనసాగిస్తున్నారు.
అక్కడ పెద్ద మొత్తంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారత్‌లోకి చొరబడేందుకు కుట్రలు చేస్తున్నారు. చొరబాటు ప్రయత్నాలకు హిజ్బుల్ కమాండర్ శంషేర్ ఖాన్ నేతృత్వం వహిస్తున్నాడు. ఉగ్రచొరబాట్లకు పాకిస్తాన్ ఆర్మీతో పాటు ఐఎస్ఐ కూడా సహకరిస్తోంది. అంతేకాదు వజీరిస్తాన్ ప్రాంతం నుంచి పదివేల మంది యువ ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకోవాలని ఐఎస్ఐ టార్గెట్ పెట్టింది. జమ్మూకశ్మీర్‌లో చొరబడేందుకు వీరందరికీ శిక్షణ ఇస్తున్నారు. భారత సాయుధ బలగాలతో పాటు కశ్మీర్‌లోని పుణ్యకేత్రాలపై దాడులకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీతో పాటు ఇతర సాయుధ దళాలను నిఘా వర్గాలు హెచ్చరించాయి. దాంతో జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India pakistan, Indian Army, Jammu and Kashmir, Pakistan army, Terrorism