• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • OWAISIS AIMIM MAY JOIN HANDS WITH KAMAL HAASANS MNM FOR TAMIL NADU POLLS LIKELY TO CONTEST AT LEAST 25 SEATS BA

Kamal Haasan: కమల్ హాసన్ పార్టీతో పొత్తుకు సిద్ధమైన హైదరాబాదీ

Kamal Haasan: కమల్ హాసన్ పార్టీతో పొత్తుకు సిద్ధమైన హైదరాబాదీ

కమల్ హాసన్

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ సారధ్యంలోని ఎంఐఎం ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 20 చోట్ల పోటీచేసి ఐదు అసెంబ్లీ సీట్లు సాధించింది. ఈ క్రమంలో తమిళనాడులో కూడా కనీసం 25 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది.

  • Share this:
    2021లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ప్రకటించారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే అంశంపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తానన్నారు. కమల్ హాసన్ సారధ్యంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 38 పార్లమెంట్ సీట్లలో పోటీ చేసింది. అలాగే, 19 సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. కానీ, కమల్ హాసన్ మాత్రం పోటీ చేయలేదు. ఎంఎన్ఎం పోటీ చేసిన నియోజకవర్గాలను పరిశీలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఆ పార్టీకి అధిక ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో చెన్నై నుంచే కమల్ హాసన్ పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సంబంధించి కమల్ హాసన్ కసరత్తు చేస్తున్నారు. మరో స్టార్ రజినీకాంత్ డిసెంబర్ 31న తన పొలిటికల్ పార్టీని ప్రకటించనున్నారు. అయితే, వారిద్దరూ పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తారా? లేకపోతే ఎవరికి వారే బరిలో దిగుతారా అనేది డిసెంబర్ 31న రజినీకాంత్ పార్టీ పెట్టిన తర్వాతే తేలనుంది.

    2021 ఏప్రిల్ లేదా మే నెలల్లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) సిద్ధమైంది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ సారధ్యంలోని ఎంఐఎం ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 20 చోట్ల పోటీచేసి ఐదు అసెంబ్లీ సీట్లు సాధించింది. ఈ క్రమంలో తమిళనాడులో కూడా కనీసం 25 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. అందుకోసం కమల్ హాసన్‌తో పొత్తు పెట్టుకునేందుకు కూడా సిద్ధమైనట్టు సమాచారం. తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఏం చేయాలి? ఎన్ని సీట్లలో పోటీ చేయాలి? ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే అంశాలకు సంబంధించి పార్టీ నేతలతో అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీసులో చర్చలు జరిపినట్టు తెలిసింది.

    కమల్ హాసన్, అసదుద్దీన్ ఒవైసీ ఇద్దరూ కేంద్రంలోని బీజేపీని వ్యతిరేకించేవారే. అలాగే, జాతి పిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను టెర్రరిస్టుగా పిలవాలని కమల్ హాసన్ డిమాండ్ చేస్తే, దానికి అసదుద్దీన్ కూడా మద్దతు పలికారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తమిళనాడులో 5.86 శాతం మంది ముస్లిం జనాభా ఉంది. ముస్లింలు నిర్ణయాత్మక ఓటర్లుగా ఉన్న నియోజకవర్గాలను కూడా ఇప్పటికే అసదుద్దీన్ లిస్ట్ ఔట్ చేసినట్టు సమాచారం.

    ఇక తమిళనాడులో కొన్ని ముస్లిం అనుకూల పార్టీలు ఉన్నా కూడా అవి గత ఎన్నికల్లో ఏదో ఒక ద్రవిడియన్ పార్టీ (డీఎంకే, అన్నాడీఎంకే) వైపు మొగ్గుచూపుతున్నాయి. ఆండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఇండియన్ నేషనల్ లీగ్, మనిత్తనేయ మక్కల్ కట్చి, మనిత్తనేయ జననాయగ కట్చి, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, తమిళనాడు తౌహీద్ జమాత్ లాంటి పార్టీలు అన్నిటినీ ఏకం చేసి కమల్ హాసన్‌తో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని అసదుద్దీన్ ఒవైసీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులోని వెల్లోర్, రానిపట్, తిరుపత్తూర్, కృష్ణగిరి, రామనాథపురం, పుద్దుక్కోట్టై, తిరుచ్చి, మధురై, తిరునల్వేలి జిల్లాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: