దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో కరోనా వ్యాప్తికి సంబంధించి విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. కరోనా ఉధృతంగా ఉన్న మహారాష్ట్ర సహా ఇతర చోట్ల ఒమిక్రాన్ కేసులు సాధారణంగానూ ఇతర వేరియంట్లు ఎక్కువగానూ వ్యాపిస్తున్నా, తమిళనాడులో అందుకు భిన్నంగా మెజార్టీ కేసులు ఒమిక్రాన్ వేరియంట్ వల్లే వస్తున్నాయి. తమిళనాడులో నమోదవుతున్న కేసుల్లో 80 నుంచి 85 శాతం మంది నమూనాల్లో ‘ఎస్’ జన్యువు తగ్గుదల కనిపిస్తోంది. ఇది ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని సూచిస్తోందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ తెలిపారు.
తమిళనాడులో నమోదవుతోన్న మొత్తం కొవిడ్ కేసుల్లో 80 నుంచి 85 శాతం ఒమిక్రాన్ రకానివి కాగా, మిగతా 15-20 మందిలో డెల్టా వేరియంట్ లక్షణాలు కనిపించినట్టు మంత్రి సుబ్రమణియన్ పేర్కొన్నారు. ‘ఎస్’ జన్యువు తగ్గుదల కనిపించిందంటే వారు ఒమైక్రాన్ వేరియంట్ బారినపడ్డారనే అర్థమని ఆయన పేర్కొన్నారు. అయితే, మరణాలు నమోదు కాకపోవడం కొంత ఊరటనిస్తోందని తెలిపారు.
ఒమైక్రాన్ సోకిన వారిలో దాదాపు 90 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారని తెలిపారు. వైరస్ బారినపడినప్పటికీ వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదన్నారు. ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, ఫేస్ మాస్క్ ధరించాలని మంత్రి సుబ్రమణియన్ సూచించారు. వైరస్ నుంచి రక్షణ కోసం ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలన్నారు.
మరోవైపు, కరోనాను అదుపు చేసేందుకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) అధికారులు పలు ఆంక్షలు అమలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. శనివారం 13 పెళ్లళ్ల నిర్వాహకులకు జరిమానా విధించారు. వివాహాలకు వందమందికి మాత్రమే అనుమతి ఉండగా, అంతకుమించి హాజరు కావడంతో చర్యలు తీసుకున్నారు. కాగా, కరోనాను అదుపు చేయడంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం ప్రతి ఆదివారం పూర్తి లాక్డౌన్ ప్రకటించింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.