భారతదేశ చరిత్ర శౌర్యపరాక్రమాలతో కూడుకున్నదని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. దురదృష్టవశాత్తూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా బానిసత్వం గురించే మనకు చెప్పారని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం.. భారతదేశాన్ని బానిసలుగా మార్చే విదేశీయుల ఎజెండాను మార్చాల్సి ఉండాలని.. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అహోం సామ్రాజ్య జనరల్ లచిత్ బోర్ఫుకాన్ 400వ జయంతి సందర్భంగా ఏడాది పొడవునా నిర్వహించిన కార్యక్రమాల ముగింపు వేడుకలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బోర్ఫుకాన్ 400వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను సందర్శించారు. ఈ కార్యక్రమంలో అస్సాం (Assam) ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, గవర్నర్ జగదీష్ ముఖి, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
5 కత్తులతో 35 ముక్కలు..శ్రద్ధ వాకర్ హత్య కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు.
''భారతదేశ చరిత్ర కేవలం బానిసత్వ చరిత్ర మాత్రమే కాదు. భారత చరిత్ర అంటే యోధుల చరిత్ర. అణచివేతదారులపై మునుపెన్నడూ లేని ధైర్యసాహసాలు ప్రదర్శించిన చరిత్ర మనకుంది. దురదృష్టవశాత్తూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా మనకు బానిసత్వంలో ఉన్న చరిత్రనే బోధించారు. మన వీరులు ఉగ్రవాదులు, వలసదారులతో పోరాడారు. కానీ ఆ చరిత్ర ఉద్దేశపూర్వకంగా అణచివేతకు గురయింది. లచిత్ బోర్ఫుకాన్ వంటి త్యాగధనులను జనజీవన స్రవంతిలోకి తీసుకురాకుండా గతంలో చేసిన తప్పును సరిదిద్దుకుంటున్నాం. '' అని ప్రధాని మోదీ అన్నారు.
ప్రస్తుతం మనదేశం తన సాంస్కృతిక వైవిధ్యాన్ని అనుసరించడమే గాక.. చారిత్రక వీరులు, వీరనారీలను గర్వంగా స్మరించుకుంటోందని ప్రధాన మంత్రి అన్నారు. బోర్ఫుకాన్ వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. కుటుంబ వాదం, బంధుప్రీతి కాదు.. ముందు దేశమే ముఖ్యమన్న ఆయన జీవితం మనకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. దేశం కంటే వ్యక్తి, బంధం పెద్దది కాదని స్పష్టం చేశారు ప్రధాని మోదీ.
కాగా, లచిత్ బోర్ఫుకాన్ 400వ జయంతి వేడుకలను ఈ ఏడాది ఫిబ్రవరిలో అస్సాంలోని జోర్హాట్లో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. లచిత్ బోర్ఫుకాన్ గతంలో అస్సాంలోని అహోం సామ్రాజ్యంలో జనరల్‌గా పనిచేశారు. 1671లో గువాహటిలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున జరిగిన సరైఘాట్ యుద్ధంలో ఆయన పాల్గొని మొఘల్ సైన్యాన్ని తరిమికొట్టారు. అస్సాంను స్వాధీనం చేసుకునేందుకు ఔరంగజేబు నేతృత్వంలోని మొఘల్ సైన్యం చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టారు. నాటి విజయానికి గుర్తుగా అస్సాంలో ప్రతి ఏటా నవంబరు 24 లచిత్ డే జరుపుకుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Narendra modi, New Delhi