సీబీఎస్ఈ సిలబస్ నుంచి కీలక పాఠ్యాంశాలు తొలగించడంపై దుమారం రేగుతోంది. లౌకికవాదం, ప్రజాస్వామ్యం హక్కులు, పౌరసత్వం, జాతీయవాదం, పెద్దనోట్ల రద్దు వంటి పాఠ్యాంశాలను సీబీఎస్ఈ తొలగించడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టడుతున్నాయి. కాంగ్రెస్‌తో పాటు ఎన్సీపీ, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా సంక్షోభం ముసుగులో సిలబస్ తగ్గింపు పేరిట రాజకీయ ఎజెండా అమలు చేస్తున్నారని విరుచుకుపడుతున్నాయి. సీబీఎస్ఈ తొలగించిన పాఠ్యాంశాలన్నీ భారత ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలను.. అలాంటి ముఖ్యమైన అంశాలను ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు.
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. 2020-21 విద్యా సంవత్సరాన్ని కుదించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ క్రమంలోనే సిలబస్‌ను కూడా సీబీఎస్ఈ తగ్గించింది. 9 నుంచి 12వ తరగతుల విద్యార్థులకు 30శాతం సిలబస్ భారాన్ని తగ్గించాలని ఇప్పటికే నిర్ణయించింది. అనంతరం కొత్త సిలబస్ వివరాలను బుధవారం వెల్లడించింది. దాని ప్రకారం.. పదో తరగతిలో 'ప్రజాస్వామ్యం- వైవిధ్యం, మతం, కులం, ప్రజా పోరాటాలు, ఉద్యమాలు, ప్రజాస్వామ్యానికి సవాళ్లు' వంటి పాఠ్యాంశాలను తొలగించారు. 11వ తరగతిలో 'సమాఖ్య విధానం, పౌరసత్వం, జాతీయవాదం, లౌకికవాదం, దేశంలో స్థానిక ప్రభుత్వాల పురోగమనం' అంశాలను తొలగించారు. 12వ తరగతిలో 'సరిహద్దు దేశాలతో భారత్ సంబంధాలు, సంస్కరణలతో ఆర్థికాభివృద్ధి, దేశంలో సామాజిక ఉద్యమాలు, పెద్దనోట్ల రద్దు' వంటి అంశాలను తీసేశారు.
ఐతే విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, నిపుణుల సలహాలు సూచనలను స్వీకరించిన తర్వాతే.. 30 శాతం సిలబస్ తగ్గించామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. సిలబస్ కుదింపు కేవలం 2020-21 విద్యా సంవత్సరానికే పరిమితమని.. ఆ తర్వాతి సంవత్సరం నుంచి యథాతధ పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది. ఐతే సీబీఎస్ఈ తొలగించిన ఈ పాఠ్యాంశాలు నీట్, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షల్లో ఉంటాయా లేదా అన్న దానిపై క్లారిటీ ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.