పార్లమెంట్ శీతాకాల సమావేశాల రెండోరోజైన మంగళవారం కూడా అధికార, విపక్షాల మధ్య రచ్చ కొనసాగింది. సాగు చట్టాల రద్దు బిల్లును ఎలాంటి చర్చ లేకుండా ప్రభుత్వం ఆమోదించుకోవడంపై నిరసన వ్యక్తం చేసిన వారిలో 12 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన వ్యవహారంపై రాజ్యసభలో ఇవాళ లొల్లి జరిగింది. సోమవారం నాడు రాజ్యసభలో సాగు చట్టాల రద్దు బిల్లు ఆమోదం సందర్భంలో విపక్ష ఎంపీలు సభాపతి పోడియాన్ని చుట్టుముట్టగా, వారి తీరు అనుచితంగా, హింసాత్మక ఉందంటూ మొత్తం 12 మంది ఎంపీలపై వేటు పడింది. సస్పెన్షన్ ఎత్తేయాలంటే సభకు సారీ చెప్పాలని కేంద్రం సూచించగా, అందుకు విపక్షాలు నిరాకరించాయి. పెద్ద మనసుతో మీరైనా సస్పెన్షన్ ఎత్తేయాలని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును విపక్ష నేతలు కోరారు. కానీ ఆయన కూడా కటవుగా వ్యవహరించడంతో విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు.
శీతాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం ఉదయం సభ కొలువుదీరగానే, నిన్నటి సస్పెన్షన్లు ఎత్తేయాంటూ విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు అక్రమమని, సస్పెండ్ అయినవాళ్లలో కొందరు కనీసం పోడియం వద్దకైనా రాలేదని వాదించారు. సభ ప్రారంభం కావడానికి ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి.. విపక్షాల నుంచి క్షమాపణలు కోరారు.
సాగు చట్టాల రద్దు బిల్లు ఆమోదం పొందిన సోమవారం నాడు రాజ్యసభలో అనుచితంగా ప్రవర్తించారంటూ 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫూలోదేవి, ఛాయావర్మ, రిపున్ బోరా, రాజామణి పటేల్, అఖిలేశ్ ప్రసాద్ సింగ్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన డోలా సేన్, శాంతి ఛత్రీ, శివసేన పార్టీ ఎంపీలు ప్రియాంక చతుర్వేది, అనిల్ దేశాయ్, సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం, సీపీఎం ఎంపీ కరీంలు స్పెండైనవారిలో ఉన్నారు. కాగా, వీరంతా సభాపతికి క్షమాపణలు చెబితే సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రభుత్వం ముందుకొస్తుందని మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
సాగు చట్టాలను ప్రవేశపెట్టిన సందర్భంలో, మళ్లీ వాటిని రద్దు చేసిన సందర్భంలోనూ కనీస చర్చ చేపట్టకపోవడం సిగ్గుచేటని, ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చ జరగాలన్నందుకు ఎంపీలను సస్పెండ్ చేయడం అన్యాయమని మండిపడ్డ విపక్ష నేతలు.. సారీ చెప్పే ప్రశ్నే ఉత్పన్నంకాబోదన్నారు. సస్పెన్షన్ ఎత్తేయాలనే డిమాండ్ ను చైర్మన్ వెంకయ్య నాయుడు కూడా తిరస్కరించడంతో విపక్ష ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Parliament Winter session, Rajya Sabha, Venkaiah Naidu