రాజస్థాన్‌లో ఓటమి... మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో హోరాహోరీ... బీజేపీకి సర్వే షాక్

రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయే అవకాశం ఉందని ఏబీపీ-సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలుపు దాదాపు ఖాయమని అభిప్రాయపడిన సర్వే... మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ తప్పదని వెల్లడించింది.

news18-telugu
Updated: October 7, 2018, 8:20 PM IST
రాజస్థాన్‌లో ఓటమి... మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో హోరాహోరీ... బీజేపీకి సర్వే షాక్
రాహుల్‌గాంధీతో సచిన్ పైలెట్, అశోక్ గెహ్లాట్(ఫైల్ ఫోటో పీటీఐ)
  • Share this:
నవంబర్, డిసెంబర్‌లో జరగబోయే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వే అంచనాల ప్రకారం మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో 15 ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. రాజస్థాన్‌లో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి వసుంధర రాజే కూడా అధికారం కోల్పోక తప్పని పరిస్థితి ఉంది.

రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని... ముఖ్యమంత్రిగా రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలెట్‌ను ఎక్కువ మంది ఓటర్లు కోరుకుంటున్నారని ఒపీనియన్ పోల్‌లో తేలింది. అయితే మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అధికార విపక్షాల మధ్య ఓట్ల శాతంలో తేడా స్వల్పంగానే ఉండటంతో ఫలితం అటు ఇటుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది.

రాజస్థాన్‌లో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 142 సీట్లు, బీజేపీ 56 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా 36 శాతం ఓటర్లు సచిన్ పైలెట్‌ వైపు మొగ్గుచూపగా, 27 శాతం మంది ప్రస్తుత సీఎం రాజే వైఫు ఆసక్తి చూపించారు. 24 శాతం మంది ఓటర్లు మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సీఎం కావాలని కోరుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీకి వచ్చే ఓట్ల శాతంలో భారీ తేడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార బీజేపీకి 34.3 శాతం ఓట్లు వస్తాయని, కాంగ్రెస్‌కు 49.9 శాతం ఓట్లు రావొచ్చని రిపోర్టులు తెలిపాయి.

మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 122 సీట్లు, బీజేపీకి 108 సీట్లు వస్తాయని సర్వే అభిప్రాయపడింది. 90 అసెంబ్లీ స్థానాలున్న చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 47 సీట్లు, బీజేపీకి 40 సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌ను ఆయా రాష్ట్రాల్లోని ఎక్కువమంది ఓటర్లు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 42.2, బీజేపీకి 41.5 శాతం ఓట్లు, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు 38.9 శాతం ఓట్లు, బీజేపీకి 38.2 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది.

శనివారం కేంద్ర ఎన్నికల కమిషన్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడంతో ఈ సర్వే ఫలితాలకు ప్రాధాన్యత ఏర్పడింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండటంతో... అక్కడ మళ్లీ కమలనాథులు పాగా వేస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది.

చత్తీస్‌గఢ్‌లో నవంబర్ 12, 20 తేదీల్లో ఎన్నికలు జరుగనుండగా, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 28న, రాజస్థాన్‌లో డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న వెలువడనున్నాయి.
Published by: Kishore Akkaladevi
First published: October 7, 2018, 8:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading