ఉక్రెయిన్ ఆక్రమణ కోసం రష్యా తలపెట్టిన యుద్దం రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నది. మూడోరోజైన శనివారం కూడా రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని పలు నగరాలపై బాంబులు కురిపిస్తూ, వాటిని వశం చేసుకున్నాయి. రాజధాని కీవ్ నగరం ఆక్రమణ కూడా ఇప్పుడా అప్పుడా అన్నట్లుంది. కాగా, ఉక్రెయిన్ యుద్దంలో చిక్కుకున్న భారతీయుల తరలింపుపై మోదీ సర్కార్ ప్రత్యేక దృష్టిపెట్టింది. ‘ఆపరేషన్ గంగా’ పేరుతో ఉక్రెయిన్ లోని భారతీయుల తరలింపును సర్కారు ముమ్మరం చేసింది. అందులో భాగంగా..
ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో రొమేనియా నుంచి 219 మంది భారతీయులతో బయల్దేరిన ఎయిర్ ఇండియా తొలి విమానం ముంబయికి చేరుకుంది. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ముంబై ఎయిర్ పోర్టులో విద్యార్థులకు స్వాగతం పలికారు. ఉక్రేయిన్ పరిస్థితులపై ఎలాంటి ఆందోళన చెందవద్దని.. ఉక్రేయిన్లో చిక్కుకున్న ఇతర భారతీయులకు కూడా ధైర్యం చెప్పాలని ఆయన సూచించారు. సురక్షితంగా భారత్కు చేరుకోవడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారతీయులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముంబయి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. వెల్కమ్ బ్యాక్ టు మదర్ ల్యాండ్ అంటూ ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా బయటపడి ముబయి విమానాశ్రయానికి చేరుకున్న భారతీయుల ముఖాల్లో చిరునవ్వులు చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం ప్రతి భారతీయుడి భద్రత కోసం అవిశ్రాంతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.
మరో 250 మంది భారతీయులతో రెండో బ్యాచ్ త్వరలోనే ఢిల్లీ చేరుకుంటుందని మంత్రి గోయల్ తెలిపారు. రొమేనియా రాజధాని నగరం బుకారెస్ట్ నుంచి భారత్కు శనివారం మధ్యాహ్నం 1.55 గంటలకు ఈ విమానం బయలుదేరింది. ఆ దేశ సహకారంతో ఉక్రేయిన్లో చిక్కుకున్న మిగతా వారిని కూడా స్వదేశానికి సురక్షితంగా చేర్చేలా కేంద్రం కృషి చేస్తోంది. 16వేల మందికిపైగా భారతీయులు ఉక్రేయిన్లో చిక్కుకున్నారు.
ఉక్రెయిన్ ప్రధాని జెలెన్ స్కీతో ఫోన్ సభాషణలో భారతీయుల తరలింపుపై ప్రధాని మోదీ సమాలోచనలు చేశారు. కాగా, ప్రస్తుతం యుద్ధం కొనసాగుతున్న నగరాల నుంచి భారతీయుల తరలింపు కష్టతరం కావడంతో ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని రాయబార కార్యాలయం సూచనలు చేసింది. సరిహద్దులకు దగ్గరగా ఉన్న నగరాల్లోని భారతీయులు, ఇతర విదేశీయుల్లో కొందరు బోర్డర్ చేరేందుకు ప్రయత్నించారు. కాగా, అలాంటి ప్రయత్నాలు వద్దని ఎంబసీ కోరింది. పరిస్థితులను బట్టి అందరినీ కాపాడుతామని భరోసా ఇచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, Piyush Goyal, Russia-Ukraine War, Ukraine