కరోనా దెబ్బ దేవుళ్లకు కూడా పడింది. ప్రపంచంలోని అన్ని దేవాలయాలు, చర్చిలు, మసీదులు మూతపడ్డాయి. ముఖ్యంగా ఎక్కువ ఆలయాలను కలిగిన దక్షిణ భారతదేశం తీవ్రంగా ప్రభావితమైంది. ఇక్కడ దేవాలయాలు మూతపడటంతో కోట్లాది రూపాయల వ్యాపారం దెబ్బతిన్నది. దేవాలయ అర్చకులు, సిబ్బంది, కార్మికులు.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్వహణ ఖర్చులను భరించడం కూడా దేవాలయాలకు ఇబ్బందిగా మారింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాయి. ఆన్‌లైన్ దర్శనాలు కల్పించడం, ప్రసాదాలను డిస్కౌంట్‌కే అందించడం లాంటి మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఉదాహారణకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన తిరుమల వేంకటేశ్వర స్వామి కూడా లాక్‌డౌన్‌కు తీవ్రంగా ప్రభావితం అయ్యాడు. టీటీడీ సిబ్బంది జీతాలపైనా దెబ్బ పడింది. టీటీడీ ఆస్తులు వేల కోట్లలో ఉన్నా.. రెండు నెలలుగా ఆదాయం లేక ఈ సమస్య వచ్చిపడింది. దీంతో శ్రీవారి ప్రసాదమైన లడ్డూను 50 శాతం డిస్కౌంట్‌కే అందజేస్తోంది.
ఇక, పక్క రాష్ట్రాలైన కర్ణాటకలో 30 వేల ఆలయాలు దేవాదాయ శాఖ కింద ఉన్నాయి. వాటన్నింటికి ఆదాయం లేకుండా పోయింది. దీంతో ఆన్‌లైన్ దర్శనాలు కల్పించడం, కొంత మొత్తానికి కోరుకున్న వారి పేరు మీద అర్చన, హోమాలు చేయించడం లాంటి కార్యక్రమాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కేరళలో ట్రావెన్‌కోర్ బోర్డు కింద వెయ్యి ఆలయాలు ఉన్నాయి. అవి కూడా ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. దీంతో పురాతన ఇత్తడి దీపాలు అమ్మేందుకు రెడీ అయ్యింది. తమిళనాడులోనూ ఇదే సమస్య ఎదురవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India news, Tirumala Temple, Ttd