ఆ కాలేజీలో 599 మంది మగ విద్యార్థులు.. నేనొక్కదాన్నే అమ్మాయిని.. : ఇన్ఫోసిస్ సుధామూర్తి

1968లో తాను ఇంజనీరింగ్ చదవాలనుకున్నప్పుడు తండ్రి తిరస్కరించారని చెప్పారు. అలా చేస్తే మన కమ్యూనిటీలో నిన్నెవరూ పెళ్లి చేసుకోరని హెచ్చరించారని గుర్తుచేసుకున్నారు.

news18-telugu
Updated: November 27, 2019, 4:45 PM IST
ఆ కాలేజీలో 599 మంది మగ విద్యార్థులు.. నేనొక్కదాన్నే అమ్మాయిని.. : ఇన్ఫోసిస్ సుధామూర్తి
ఇన్ఫోసిస్ సుధామూర్తి,అమితాబ్ బచ్చన్(Image : Youtube screen grab)
  • Share this:
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్ పతీ 11' చివరి ఎపిసోడ్‌లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్,ప్రముఖ రచయిత్రి సుధామూర్తి పాల్గొన్నారు. సుధామూర్తితో అమితాబ్ సంభాషణకు సంబంధించిన షార్ట్ ప్రోమోను సోనీ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన నేపథ్యం,సామాజిక సేవ గురించి సుధామూర్తి వివరిస్తూ సాగిన ఆ ప్రోమో నెటిజెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. స్ఫూర్తిదాయకంగా,ఆదర్శవంతంగా సాగిన ఆమె జర్నీ గురించి స్వయంగా ఆమె మాటల ద్వారా తెలుసుకునేందుకు.. చాలామంది పూర్తి ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. తన నేపథ్యానికి సంబంధించి ప్రోమోలో సుధామూర్తి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

1968లో తాను ఇంజనీరింగ్ చదవాలనుకున్నప్పుడు తండ్రి తిరస్కరించారని చెప్పారు. అలా చేస్తే మన కమ్యూనిటీలో నిన్నెవరూ పెళ్లి చేసుకోరని హెచ్చరించారని గుర్తుచేసుకున్నారు.అయితే తాను మాత్రం ఇంజనీరింగ్ చదివేందుకే నిర్ణయించుకున్నానని చెప్పారు. కర్ణాటకలోని హుబ్లిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో తాను చేరానని.. 599 మంది మగ విద్యార్థులు ఉన్న ఆ కాలేజీలో తాను ఒక్కదాన్నే మహిళా స్టూడెంట్‌ని అని చెప్పారు. కాలేజీలో అడ్మిషన్ ఇచ్చే సమయంలో ప్రిన్సిపాల్ తనకు మూడు షరతులు విధించారని తెలిపారు.

అందులో ఒకటి ప్రతీరోజూ కాలేజీకి చీరకట్టులోనే రావాలి. రెండోది.. కాలేజీ క్యాంటీన్‌కి వెళ్లవద్దు. మూడవది..ఎట్టి పరిస్థితుల్లోనూ మగ విద్యార్థులెవరితోనూ మాట్లాడవద్దు. మొదటి షరతు ప్రకారం ప్రతీరోజూ తాను చీరలోనే వెళ్లేదాన్ని అని చెప్పారు. కాలేజీ క్యాంటీన్ అసలేమాత్రం బాగుండదని.. కాబట్టి అక్కడికి వెళ్లేదాన్ని కాదన్నారు.ఇక కాలేజీలో చేరిన ఏడాది వరకు ఏ మగ విద్యార్థితోనూ మాట్లాడలేదని.. కానీ తాను టాపర్ కావడంతో వాళ్లే తన వద్దకు వచ్చి మాట్లాడేవారని చెప్పుకొచ్చారు.

తాను చదువుకున్న కాలేజీలో కనీసం టాయిలెట్ వసతి కూడా లేదని చెప్పారు. అందుకే ఇన్ఫోసిస్ తరుపున దాదాపు 16వేల టాయిలెట్స్ నిర్మించినట్టు తెలిపారు. దేవదాసీ వ్యవస్థను రూపుమాపేందుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తరుపున ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఆ సమయంలో ఎదురైన సవాళ్లను కూడా వివరించారు. కొంతమంది ఎయిడ్స్ రోగులైన మహిళలను కలిసి మాట్లాడుతున్న సందర్భంలో.. తనపై ఒకరు చెప్పు విసిరారని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో దు:ఖం వచ్చిందన్నారు. కానీ సమాజంలో మార్పు మొదలుకావాలంటే మొదట చిన్నారుల నుంచి మొదలుపెట్టాలని.. వారికి చదువు అందితే.. ఆ తర్వాత వారి తల్లులు నీ మాట వింటారని తన తండ్రి చెప్పినట్టుగా గుర్తుచేసుకున్నారు. ఆయన చెప్పినట్టుగానే ఎంతోమంది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందించి విద్యను అందించామన్నారు.


Published by: Srinivas Mittapalli
First published: November 27, 2019, 4:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading