కొత్తగా వచ్చిన మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం దేశంలో ఇప్పటి వరకు చాలా చోట్ల భారీ ఎత్తున జరిమానాలు విధిస్తున్నారు. హెల్మెట్లు పెట్టుకోని వారికి, సీట్ బెల్టులు పెట్టుకోని వారికి, వాహనాల పత్రాలు దగ్గర పెట్టుకోని వారికి, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘించే వారికి భారీ ఎత్తున ఫైన్లు వేస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు వేసిన జరిమానాలకంటే ఇదే అత్యధికం. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఓ ట్రక్కు డ్రైవర్‌కు అధికారులు అక్షరాలా 86వేల 500 రూపాయల జరిమానాను విధించారు. అశోక్ జాదవ్ అనే ట్రక్ డ్రైవర్‌కు అధికారులు ఈ భారీ ఫైన్ వేశారు. సెప్టెంబర్ 3న ఈ చలాన్ విధించారు. దానికి సంబంధించిన ఫొటోలో తాజాగా వైరల్ అయ్యాయి.
అనధికార వ్యక్తితో (క్లీనర్) వాహనం నడిపించినందుకు రూ.5000
లైసెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు రూ.5000
పరిమితి కంటూ ఓవర్ లోడ్ వేసినందుకు రూ.56,000
ట్రక్కులో ఇచ్చిన పరిమాణం కంటే బయట కూడా లోడ్ వేసినందుకు రూ.20,000 (JCBని తీసుకుని వెళ్తుంది)
సాధారణ ఉల్లంఘనలకు రూ.500
రూ.86,500 జరిమానా విధిస్తే ఆ లారీ డ్రైవర్ అధికారులను బతిమాలుకుని రూ.70వేలు ఫైన్ కట్టారు. సుమారు 5 గంటల పాటు అధికారులను బతిమాలుకున్న తర్వాత వారు అందుకు అంగీకరించారు. సదరు లారీ నాగాలాండ్‌కు చెందిన బీఎల్ఏ ఇన్ఫ్రా కంపెనీకి చెందనది. జేసీబీ మెషిన్‌ను తీసుకుని వెళ్తుంది. ఛత్తీస్‌గఢ్ వెళ్తుండగా రవాణాశాఖ అధికారులు పట్టుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి దేశంలో కొత్తగా మోటార్ వెహికల్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఆ చట్టం ప్రకారం ఒక్క ఒడిశాలోనే తొలి నాలుగు రోజుల్లో సుమారు రూ.88లక్షల జరిమానాల విధించారు. దేశంలో ఇదో రికార్డు. మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో జరిమానాలు విధించలేదు. గత వారం భువనేశ్వర్‌లో ఓ ఆటోడ్రైవర్‌కు రూ.47,000 జరిమానా వేశారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:September 08, 2019, 17:55 IST