సాధారణంగా బైక్ పై వెళ్తుంటే సిగ్నల్ జంప్ చేస్తేనో, హెల్మెట్ లేకపోతేనో, లైసెన్స్ లేకపోతే ట్రాఫిక్ పోలీస్ ఓ వందో, రెండొందల రూపాయలో ఫైన్ వేసి వదిలేస్తాడు. మహా అయితే ఓ వెయ్యి జరిమాన విధిస్తారు. కానీ లక్ష రూపాయలు ఫైన్ వేయడం ఎక్కడైనా విన్నారా..? ఆ ఫైన్ కట్టేబదులు కొత్త బైక్ కొనుక్కోవచ్చని అనుకుంటున్నారా..? కానీ ఓ చోట మాత్రం బైక్ కు ఏకంగా రూ.1.13 లక్షల జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే ఒడిశా రాష్ట్రం రాయగడ డీవీఐ జంక్షన్ వద్ద పోలీసులు, ఆర్టీవో సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈలోగా ప్లాస్టిక్ డ్రమ్ములు అమ్ముకుంటూ మధ్యప్రదేశ్ కు చెందిన ప్రకాశ్ అనే వ్యక్తి అటుగా వచ్చాడు. బైక్ పై 8 డ్రమ్ములు కట్టుకొని ఊరూరా తిరుగుతూ అమ్ముకుంటున్నాడు.
డ్రమ్ముల లోడ్ వేసుకొని రోడ్డుకు అడ్డదిడ్డంగా వెళ్తుండటంతో పోలీసులు అతడ్ని ఆపి బైక్ డాక్యుమెంట్స్ అడిగారు. అతని దగ్గర డాక్యుమెంట్స్ లేవు. సరికదా పోలీసులు ఆన్ లైన్లో చెక్ చేయగా అసలు బైక్ కు రిజిస్ట్రేషన్ కూడా లేదు. దీంతో వెయ్యి కాదు రెండవేలు కాదు ఏకంగా లక్షా 13వేల రూపాయలు జరిమానా విధించారు. ఒక్కసారిగా షాక్ గు గురైన ప్రకాష్.. అప్పటికప్పుడు స్నేహితులు, బంధువుల వద్ద అప్పుచేసి ఫైన్ చెల్లించాడు.
బైక్ ఇంత ఫైన్ వేయడంపై నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా.. అసలు రిజిస్ట్రేషన్ లేకుండా బైక్ రోడ్డుపైకి ఎలా వచ్చిందనేది ఆసక్తికరంగా మారింది. ఐతే వీధివ్యాపారికి లక్షల్లో ఫైన్ వేయడాన్ని కొంతమంది తప్పుబడుతున్నారు. డ్రమ్ములు అమ్ముకునే వ్యక్తి లక్ష రూపాయల ఫైన్ ఎలా చెల్లిస్తాడని ప్రశ్నిస్తున్నారు. అదే సెలబ్రెటీలో, రాజకీయ నాయకులో అయితే అంత శిక్ష వేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు మాత్రం చట్టం ముందు అందరూ ఒక్కటేనంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Odisha, Traffic challan, Traffic police