ఏఎస్సై కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒడిశా ఆరోగ్య శాఖా మంత్రి నబ కిషోర్ దాస్ మృతి చెందారు. ఆయన ఛాతి భాగంలోకి తూటా బలంగా దూసుకెళ్లడంతో పరిస్థితి విషమంగా మారింది. చికిత్స అందిస్తున్న క్రమంలో మంత్రి నబ కిషోర్ దాస్ తుది శ్వాస విడిచినట్టు అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయనను ఆసుపత్రికి తీసుకురాగానే చికిత్చ ప్రారంభించిన వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. గుండె, ఎడమ ఊపిరితిత్తుల్లో బుల్లెట్ గాయంతో అధిక రక్తస్రావం జరిగిందని అపోలో వైద్యులు తెలిపారు.
అసలేం జరిగింది?
ఆదివారం ఉదయం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒడిశా రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నబ కిషోర్ దాస్ వచ్చారు. ఆ సమయంలో అక్కడే కాపు కాచుకొని ఉన్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మంత్రి కారులోంచి దిగగానే రివాల్వర్‌తో ఐదు, ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మంత్రికి బుల్లెట్ గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే అలెర్ట్ అయిన ఆయన భద్రత సిబ్బంది, ఇతర పోలీసులు వెంటనే నబ కిషోర్ దాస్ ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన డాక్టర్లు హెల్త్ మినిస్టర్ నబా కిషోర్ దాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రాత్రి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూశారు. ఆయన మృతితో ఒడిశాలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఇక మంత్రిపై దాడి చేసిన ఏఎస్సైని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రిపై కాల్పులు జరపడానికి కారణం ఏమై ఉండవచ్చని ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి కాల్పులు జరిపిన వ్యక్తిని ప్రశ్నిస్తున్నామని బ్రజ్ రాజ్ నగర్ ఎస్ డీపీవో గుప్తేశ్వర్ బోయ్ తెలిపారు. పోలీసు అధికారిగా ఉండి అది కూడా ఆరోగ్య శాఖా మంత్రిని కాల్చి చంపడంతో ఒడిశాలో కలకలం రేగింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
మంత్రి మృతితో రాష్ట్ర రాజకీయాల్లో విషాదం నెలకొంది. దేశంలో ఇలాంటి ఘటన జరగడం అరుదనే చెప్పుకోవాలి. కాల్పులకు పాల్పడ్డ ఏఎస్సై విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Odisha