కాబోయే తల్లులకు ప్రసవ నొప్పులు (Labor Pains) వచ్చిన సమయంలో పడే అవస్థలు వర్ణణాతీతం. ఇక వాహనాలు వెళ్లేందుకు అనువుగాలేని రోడ్ల ద్వారా ఆసుపత్రికి చేరే గర్భిణీల కష్టాలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంటాయి. ఇలాంటి దుర్భర పరిస్థితులలో తల్లులు దేవుడి మీదే భారం వేస్తారు. కొన్ని సందర్భాల్లో మనసున్న దయా హృదయులు కనికరించి గర్భిణీలను సురక్షితంగా ఆసుపత్రులకు తరలిస్తుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒడిశా రాష్ట్రంలోని (Odisha State) భువనేశ్వర్ లో చోటు చేసుకుంది. ప్రసవ వేదనతో పడుతున్న ఒక నిండు గర్భిణిని అంబులెన్స్ (Ambulance) సిబ్బంది 7 కి.మీ. వరకు భుజాలపై మోస్తూ సరైన సమయానికి ఆసుపత్రికి తరలించారు. తమ డ్యూటీని సైతం పక్కనపెట్టి తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడిన అంబులెన్స్ సిబ్బందిపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రజలు.
వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా, ఒలంద గ్రామానికి చెందిన సునీలా సబర్ అనే గర్భిణికి ఇటీవల ప్రసవ నొప్పులు వచ్చాయి. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను సమీప ఆసుపత్రికి తరలించడానికి 108 (Emergency) కి ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న కొద్ది నిమిషాలలో ఒక అంబులెన్స్ ఒలంద గ్రామానికి చేరుకుంది. కానీ కాంక్రీట్ రోడ్డును దాటుకొని ముందుకు వెళ్ళలేకపోయింది. ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం కరువైంది. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తుండడంతో ఆ ప్రాంతం మొత్తం బురదగా మారింది. అంబులెన్స్ ని ముందుకు నడిపితే దాని టైర్లు మోకాలు లోతు బురద మట్టిలో కూరుకుపోవడం ఖాయం.
దీంతో అంబులెన్స్ డ్రైవర్ గర్భిణీ కుటుంబానికి ఫోన్ చేసి గ్రామంలోకి రాలేమని తెలిపాడు. ఆ సమయంలోనే గర్భవతి కుటుంబంలో ఒక వృద్ధుడు తప్ప మిగిలిన వారందరూ ఆడవారేనని తెలుసుకున్నాడు. అప్పుడే వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. కాలినడకన నడచి గర్భవతిని ఆసుపత్రికి తరలించాలని భావించాడు. అనుకున్నదే తడవుగా బురద మట్టిని సైతం లెక్క చేయకుండా ముందుకు వెళ్ళాడు. అతనితోపాటు వచ్చిన ఫార్మసిస్ట్.. మేక్-షిఫ్ట్ స్ట్రెచర్ పట్టుకొని గ్రామంలోకి నడిచాడు.
వీళ్ళిద్దరూ కలిసి సునీలా ఇంటికి వెళ్లి ఆమెను స్ట్రెచర్ పైకి ఎక్కించి.. దానిని భుజాలపైనే మోస్తూ అంబులెన్స్ వద్దకు చేర్చారు. ఆపై ఆమెను చంద్రగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకురావడంతో ఆమె సురక్షితంగా వైద్యుల సమక్షంలో ఓ పండంటి బిడ్డను ప్రసవించింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులతో సహా ప్రతి ఒక్కరూ అంబులెన్స్ సిబ్బందిని ప్రశంసిస్తున్నారు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.