లేడీ జర్నలిస్ట్‌పై ఎంపీ దాడి.. ముఖంపై ఉమ్మి...

ఈ ఘటనకు సంబంధించి సీఎం నవీన్ పట్నాయక్ సరైన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్టు బాధితురాలు చెప్పారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోని పక్షంలో తాను మహిళా కమిషన్ వద్దకు వెళ్తానని ప్రకటించారు.

news18-telugu
Updated: June 14, 2019, 10:50 PM IST
లేడీ జర్నలిస్ట్‌పై ఎంపీ దాడి.. ముఖంపై ఉమ్మి...
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో అనుభవ్ మహంతి (File)
  • Share this:
ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్ ఎంపీ అనుభవ్ మహంతీ అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారంటూ ఓ మహిళా జర్నలిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎంపీ సోదరుడు తనను వేధిస్తున్నాడని, దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తన మీద ఎంపీ, ఆయన భార్య కలసి దాడి చేశారంటూ కటక్‌లోని పూరీఘాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పలు సెక్షన్ల కింద పోలీసులు ఎంపీ మీద కేసు నమోదు చేశారు. 37 ఏళ్ల అనుభవ్ మహంతీ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రపార నియోజకవర్గం నుంచి బీజేడీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఒడిశాలో బీజేపీ ముఖ్యనేత బైజయంత్ పాండా మీద 1.52లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతకు ముందు 2014 జూన్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.

ఒడిశాలోని ఓ పత్రికలో పనిచేసే మహిళా జర్నలిస్టును ఎంపీ తమ్ముడు అనుప్రాష్ మహంతీ, అతని ఫ్రెండ్స్ గత రెండేళ్లుగా వేధిస్తున్నారు. ఈనెల 12న కూడా ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తున్న ఆమెను వేధించారు. దీంతో తమ్ముడి మీద ఫిర్యాదు చేసేందుకు ఎంపీ అయిన అన్న వద్దకు ఆమె వెళ్లారు. అయితే, గుమ్మంలోనే అనుభవ్ మహంతీ, ఆయన భార్య కలసి ఆమె మీద దాడి చేశారు. బూతులు తిట్టారు. అనంతరం పోలీసులను పిలిచి ఆమెను అరెస్ట్ చేయించారు. మహిళా జర్నలిస్ట్ పోలీసు వాహనంలో కూర్చుని ఉండగా, ఆ వ్యాన్ వద్దకు వచ్చిన ఎంపీ అనుభవ్ మహంతీ ఆమె ముఖం మీద ఉమ్మినట్టు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించి సీఎం నవీన్ పట్నాయక్ సరైన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్టు బాధితురాలు చెప్పారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోని పక్షంలో తాను మహిళా కమిషన్ వద్దకు వెళ్తానని ప్రకటించారు. అయితే, మహిళా జర్నలిస్ట్ ఆరోపణలను ఎంపీ అనుభవ్ మహంతి ఖండించారు. తాను పోలీసులను పిలిచి ఆమెను తన ఇంటి వద్ద నుంచి పంపేశానని చెప్పారు.

First published: June 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>