హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

US Elections: జో బైడెన్ ఎన్నికల వ్యూహకర్త, ఒబామాకి క్లోజ్ అయిన వివేక్ మూర్తి ప్రయాణం

US Elections: జో బైడెన్ ఎన్నికల వ్యూహకర్త, ఒబామాకి క్లోజ్ అయిన వివేక్ మూర్తి ప్రయాణం

వివేక్ మూర్తి (File/Image;Twitter)

వివేక్ మూర్తి (File/Image;Twitter)

కర్ణాటక మూలాలున్న వివేక్ మూర్తి బ్రిటన్‌లో జన్మించారు. అమెరికాలో పెరిగారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బీఏ చేశారు. యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.

  (DP Satish, News18)

  అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులే ఉంది. ఒకవేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయి జో బైడెన్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తే ఓ భారతీయ అమెరికన్‌కి కచ్చితంగా కీలక పదవి దక్కడం మాత్రం ఖాయం. ఆయన ఎవరో కాదు. డాక్టర్ వివేక్ మూర్తి. ఆయన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారంలో ఉన్నప్పుడు 2014లో అత్యంత చిన్నవయసు సర్జన్ జనరల్. ప్రస్తుతం జో బైడెన్‌ ఎన్నికల క్యాంపెయిన్ స్ట్రాటజిస్ట్. 43 సంవత్సరాల వివేక్ మూర్తి కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ఉన్న హళెగెరె గ్రామానికి చెందిన వారు. వివేక్ మూర్తి తాత హెచ్‌టీ నారాయణ శెట్టి. కర్ణాటకలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. అలాగే, కర్ణాటక మాజీ సీఎం, దివంగత దేవరాజ్ ఉరుస్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. వివేక్ మూర్తి గురించి తెలిసిన హళెగెరె గ్రామ వాసులు ఆనందంలో ఉన్నారు.

  ఎంత ఎదిగినా, వివేక్ మూర్తి తన మూలాలను, మాతృభాషను వదిలిపెట్టలేదు. ఇంటి వద్ద కచ్చితంగా కన్నడలో మాట్లాడతారు. ప్రతి సంవత్సరం తాను పుట్టిన ఊరికి వస్తారు. అక్కడ విద్యను ప్రోత్సహించేందుకు కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చారు. డాక్టర్ వివేక్ మూర్తి తండ్రి డాక్టర్ హెచ్‌ఎన్ లక్ష్మీ నరసింహ మూర్తి. మైసూర్ మెడికల్ కాలేజీలో చదువుకున్నారు. ఆయన యూకేలో పలు హోదాల్లో పనిచేశారు. వివేక్ సోదరి రష్మి కూడా అమెరికాలోని ఫ్లోరిడాలో ఫిజీషియన్‌గా సేవలు అందిస్తున్నారు. ప్రతి ఏటా హళెగెరె గ్రామానికి వచ్చినప్పుడు తమ కుటుంబం ఏర్పాటు చేసిన స్కోప్ ఫౌండేషన్ తరఫున మెడికల్ క్యాంప్ నిర్వహిస్తారు. గతంలో నిర్వహించిన కంటి పరీక్ష క్యాంప్‌లో 60 మందికి ఆపరేషన్లు కూడా చేయించారు. అలాగే, మద్దూర్ తాలూకాలోని ప్రభుత్వ స్కూలుకు 100 కంప్యూటర్లను కూడా బహూకరించారు. మాండ్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఒకేసారి కంప్యూటర్లను అందివ్వాలని వివేక్ మూర్తి కుటుంబం భావించినా, ఆయా స్కూళ్లలో కరెంటు, నిర్వహణ సమస్యల వల్ల విడతల వారీగా అందించాలని నిర్ణయించారు. దీంతోపాటు కంప్యూటర్ల కోసం సోలార్ కిట్లు కూడా అందిస్తోంది స్కోప్ ఫౌండేషన్. ఉచిత హెల్త్ కవర్‌ను ఎలా అమలు చేయవచ్చనే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కూడా వివేక్ మూర్తి ముందుకొచ్చారు.

  కర్ణాటక మూలాలున్న వివేక్ మూర్తి బ్రిటన్‌లో జన్మించారు. అమెరికాలో పెరిగారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బీఏ చేశారు. యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ఎండీ చేశారు. వివేక్ మూర్తికి ఆస్పత్రి ఉంది. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేసే డాక్టర్ ఆఫ్ అమెరికా అనే సంస్థకు ఆయన సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు కూడా. ఈ సంస్థ తక్కువ ధరకే క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసులు అందిస్తుంది. సుమారు 16,000 మంది ఫిజీషియన్లు, మెడికల్ స్టూడెంట్లు, మెడికల్ సలహాదారులు ఇందులో సేవలు అందిస్తారు. డాక్టర్స్ ఆఫ్ అమెరికా అనేదాన్ని డాక్టర్స్ ఫర్ ఒబామా అని కూడా పిలుస్తారు. ఒబామా కోసం 2008, 2012లో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించింది. ఒబామా అధ్యక్షుడు అయిన తర్వాత 2011లో వివేక్ మూర్తిని ప్రజారోగ్యంపై సలహదారుగా నియమించారు. అమెరికాకు చెందిన గన్ లాబీ తీవ్రంగా వ్యతిరేకించినా కూడా అత్యంత తక్కువ వయసులోనే (37) వివేక్ మూర్తిని తన సర్జన్ జనరల్‌గా అపాయింట్ చేశారు ఒబామా. అమెరికన్ సెనేట్‌లో దీనిపై ఓటింగ్ కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన నియామకాన్ని సెనేట్ ఆమోదించింది.

  అమెరికాకు సంబంధించి ప్రజారోగ్య సమస్యలపై అత్యున్నత స్థాయి అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. రెండు పార్టీలకు చెందిన (డెమొక్రాట్స్, రిపబ్లికన్స్) ప్రతినిధులు కూడా మూర్తి సామర్థ్యం మీద అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, ఒబామా హెల్త్ కేర్ తీసుకురావడంలో మూర్తి పాత్ర కీలకం. ఒకవేళ జో బైడెన్ గెలిస్తే డాక్టర్ మూర్తికి మళ్లీ కీలక పదవి రావడం ఖాయం. కర్ణాటకలోని తమ సొంత గ్రామం హళెగెరెలో ఆనందోత్సవాలు తథ్యం.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Barack Obama, Donald trump, Joe Biden, US Elections 2020

  ఉత్తమ కథలు