హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Shocking: నవజాత శిశువు వేలును కత్తిరించిన నర్సు.. తల్లి చూస్తుండగానే దారుణం..

Shocking: నవజాత శిశువు వేలును కత్తిరించిన నర్సు.. తల్లి చూస్తుండగానే దారుణం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నవజాత శిశువు రక్తాన్ని కళ్లజూసిందో నర్సు. ఇంట్రావీనస్ లైన్ (IV) కాన్యులాను తొలగిస్తుండగా పొరపాటున వేలిని కట్ చేసింది. తమిళనాడులో ఈ ఘటన జరిగింది.

నవజాత శిశువు చేతి బొటనవేలును ఒక నర్సు పొరపాటున కత్తిరించిన ఘటన తమిళనాడులోని తంజావూరులో జరిగింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు ప్రభుత్వ ఆసుపత్రి డీన్. వివరాల్లోకి వెళ్తే.. తంజావూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని రోజుల క్రితం ఒక మహిళ ప్రసవించింది. అప్పుడే పుట్టిన పాప చేతికి ఇంట్రావీనస్ లైన్ (IV) కాన్యులా పెట్టి, దాని ద్వారా ఫ్లూయిడ్స్ అందించారు. సోమవారం పాపను హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ చేయాల్సి ఉంది. అదే రోజు శిశువు ఎడమ చేతికి ఉన్న ఐవీ కాన్యులాను సదరు నర్సు కత్తెరతో తొలగించాలని ప్రయత్నించింది. అయితే ప్రమాదవశాత్తు ఎడమ చేతి బొటన వేలును ఆమె కత్తిరించింది. దీంతో వేలు మధ్య నుంచి చివర వరకు తెగిపోయింది. ప్రమాదంలో తెగిపోయిన బొటనవేలు భాగాన్ని, సీనియర్ వైద్యులు సర్జరీ ద్వారా అతికించారు.

ఈ ఘటనపై విచారణ చేపట్టి, సదరు నర్సును శిక్షించాలని కోరుతున్నారు శిశువు తల్లిదండ్రులు. కేవలం రెండు వారాల వయసున్న తమ పాప విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. అయితే కత్తెర సాయంతో ఇంట్రావీనస్ లైన్ కాన్యులాను తొలగిస్తున్నప్పుడు, శిశువు భయపడి ఉండవచ్చని తంజావూరు ప్రభుత్వ ఆసుపత్రి డీన్ డాక్టర్ జి.రవికుమార్ చెప్పారు. దీంతో ప్రమాదవశాత్తూ బొటనవేలు చివరి భాగం కొంత వరకు కత్తెర మధ్యలో పడి, తెగిపోయిందని తెలిపారు. ఈ విషయంపై డిపార్ట్‌మెంటల్ విచారణకు ఆదేశాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

‘కాన్యులాను తొలగించేటప్పుడు శిశువు కదిలినట్లు సిబ్బంది చెప్పారు.ఆ సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం అందింది. దీనిపై డిపార్ట్‌మెంటల్ విచారణకు ఆదేశిస్తున్నాం. దీంతో పాటు ఈ విషయాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఈ ఘటన తరువాత సదరు నర్సు సైతం విచారం వ్యక్తం చేసింది. నవజాత శిశువు తన కారణంగా ఇబ్బంది పడుతుందనే ఆలోచనలతో ఆమె కుంగుబాటుకు గురైంది. నర్సు ఆసుపత్రికి తిరిగి వచ్చిన తర్వాత, పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం. దర్యాప్తు ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకుంటాం’ అని ఆయన విలేకరులతో చెప్పారు.

వైద్యులు సకాలంలో స్పందించి తెగిపోయిన వేలును తిరిగి సర్జరీ ద్వారా అతికించారని డాక్టర్ రవికుమార్ చెప్పారు. అయితే ఆ భాగం శిశువు వేలుకు సరిగ్గా అతుక్కుంటుందా లేదా అనేది తెలుసుకోవడానికి మూడు రోజులు పడుతుందన్నారు. సీనియర్ వైద్యులతో కూడిన దర్యాప్తు బృందం త్వరలో నర్సును ప్రశ్నించనుంది. పూర్తి స్థాయి విచారణ తరువాత ప్రమాదానికి కారణమైన నర్సుపై తగిన చర్యలు తీసుకుంటామని డీన్ వివరించారు.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Crime news, Tamil nadu, Tamilnadu

ఉత్తమ కథలు