జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరోసారి కాశ్మీర్ వెళ్లారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ విభజన తర్వాత అక్కడికి వెళ్లడం ఇది రెండోసారి. జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగించిన అనంతరం అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటూ, ఎప్పటికప్పుడు భద్రతను సమీక్షించిన ఆయన.. ఇప్పుడు మరోసారి అక్కడికి వెళ్లారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం పాక్ ఆర్మీ దళాలు, ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భద్రతపై పూర్తి స్థాయి సమీక్షకు ఆయన కాశ్మీర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్టోబరు 31 నుంచి జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం కానుండటంతో రాష్ట్రంలో ప్రస్థుత పరిస్థితులను తెలుసుకునేందుకు ఆయన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఆగస్టు 5న కేంద్రం జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి తొలగించిన తర్వాత నుంచి 11 రోజుల పాటు దోవల్ అక్కడే ఉన్న విషయం తెలిసిందే. మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా కనిపించే దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ టౌన్, శ్రీనగర్ డౌన్‌టౌన్‌లలో పర్యటించారు.
కాగా, అజిత్ దోవల్ కాశ్మీర్ పర్యటన వెనుక భద్రత కారణాలున్నాయా? లేక కేంద్రం మరో చర్యకు దిగబోతోందా? అని సర్వత్రా చర్చ నడుస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకుంటామని పలువురు నేతలు, ఆర్మీ చీఫ్ చెబుతున్న నేపథ్యంలో ఆ చర్యకు దిగుతారా? పీవోకేను స్వాధీనం చేసుకుంటారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ajit Doval, Article 370, Jammu and Kashmir, Kashmir security