Tirumala: కశ్మీర్, ముంబైల్లోనూ తిరుమల వెంకటేశ్వరుని దర్శనం.. ఎలాగో తెలుసా?

తిరుమల వెంకన్న స్వామి

దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులందరి కోసం త్వరలో తిరుపతి ఆలయాన్ని పోలిన దేవాలయాలను నిర్మించబోతున్నారు. ముంబై, జమ్ము కశ్మీర్‌లలో అచ్చం తిరుమల పోలిన వెంకటేశ్వరుడి ఆలయాలను నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది.

  • Share this:
భారతదేశంలో అనాది కాలంగా ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అందుకే దేవాలయాలు, మందిరాలు మన దేశంలో అధికంగా కనిపిస్తాయి. ముఖ్యంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పూరాతన దేవాలయాలు చాలానే ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుమల తిరుపతి దేవాస్థానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశంలోనే అత్యంత ధనిక దేవాలయంగా ఈ గుడి గుర్తింపు తెచ్చుకుంది. ద్రవిడ శైలిలో ఉండే ఈ ఆలయానికి రోజూ 50వేల మందికి పైగా యాత్రికులు వస్తారు. పండగల సమయంలో ఈ సంఖ్య లక్షల్లో ఉంటుంది. అందుకే దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులందరి కోసం త్వరలో తిరుపతి ఆలయాన్ని పోలిన దేవాలయాలను నిర్మించబోతున్నారు. ముంబై, జమ్ము కశ్మీర్‌లలో అచ్చం తిరుమల పోలిన వెంకటేశ్వరుడి ఆలయాలను నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది.

జమ్మూలో ఉన్న వైష్ణో మాతా దేవాలయానికి భక్తులు అధికంగా వస్తారు. దీంతో పాటు ఇక్కడ ప్రసిద్ధ మందిరాలు ఇంకా చాలా ఉన్నాయి. అందుకే సిటీ ఆఫ్ టెంపుల్స్‌గా జమ్మూ గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో అక్కడే తిరుమల శ్రీనివాసుడి దర్శన భాగ్యం కూడా భక్తులను కల్పించాలని టీడీపీ నిర్ణయించింది. కశ్మీర్లో ఆలయంతో పాటు వేద పాఠశాల, ధ్యాన కేంద్రం, కార్యాలయం, నివాస గృహాలు, పార్కింగ్ స్థలాన్ని టీటీడీ నిర్మిస్తుంది. ఇందుకోసం టీటీడీ బోర్డు 496 కనాల్ 17 మార్లాలో భూమిని స్వీకరించనుంది. జమ్ము కశ్మీర్ ప్రభుత్వం టీటీడీ బోర్డుకు భూమిని 40 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది.

అటు ముంబైలోనూ తిరుమల వెంకటేశ్వరుడి ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం తూర్పు బాంద్రా ప్రాంతంలో ఉన్న భూమిని మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దాదాపు 30 కోట్ల రూపాయలతో ఈ ఆలయ నిర్మాణం జరగనుంది. ఈ మందిరం కూడా టీటీడీ నిర్వహణలోనే ఉంటుందని బోర్డు సభ్యులు అమోల్ కాలే తెలిపారు. తిరుపతి దేవాలయం మాదిరి కూడా అలాంటి ఆలయాన్నే నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. విగ్రహం కూడా మాతృకను పోలి ఉంటుందని టీటీడీ బోర్డు సభ్యులు తెలిపారు. ప్రతి ఒక్కరికి తిరుపతి వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోవడం వీలు కాదని, అందుకే టీటీడీ బోర్డు ముంబయిలో ఆలయం నిర్మించేందుకు నిర్ణయించామని స్పష్టం చేశారు.

"ఈ ఏడాది ఆలయాన్ని పూర్తి చేయాలని భావించాం. అయితే కోవిడ్-19 ప్రభావం వల్ల అది సాధ్యపడలేదు. తూర్పు బాంద్రాలోని ఆలయ నిర్మాణ పనులు వచ్చే నెల నుంచి ప్రారంభమవుతాయి. రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జనవరిలోనే భూమి పూజ నిర్వహించాం. రెండేళ్లలో భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు పూర్తి చేస్తాం" టీటీడీ బోర్డు సభ్యులు అమోల్ కాలే తెలిపారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ ఈ మందిరానికి డిజైన్ చేశారు. ఈ మందిరం 9 ఫ్లోర్లు ఉంటుంది. ధ్యానం, ప్రార్ధన, యోగా కోసం ప్రత్యేక మందిరాలు ఏర్పాట్లు చేయనున్నారు. సిబ్బంది కోసం క్వార్టర్లు కూడా నిర్మించనున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: