మన దేశంలో పాములు లేని రాష్ట్రం లేదు... పాముకాట్లతో మరణాలు సంభవించని జిల్లాలు లేవు. ముఖ్యంగా దేశం కడుపు నింపుతున్న రైతన్నలు... పాముకాట్ల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో తెల్లారి కరెంటు ఉంటుందో లేదో అనే ఉద్దేశంతో... రాత్రిళ్లు పొలం దగ్గర వాటర్ మోటర్ ఆన్ చెయ్యాలని వెళ్లి... పాముకాట్లకు బలైపోతున్నారు కర్షకులు. ఈ పరిస్థితి ఉత్తరప్రదేశ్‌లో బాగా ఉంది. దాంతో అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భూకంపం, సునామీ, తుఫాన్ల లాగే... పాముకాట్లను కూడా రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. ఇకపై ఎవరైనా సరే... పాముకాటుతో చనిపోతే... ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.4 లక్షలు పరిహారంగా ఇస్తుందని తెలిపింది. అది కూడా మరణం సంభవించిన 7 రోజుల్లోనే పరిహారం ఇస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లను అదనపు సీఎస్ మనోజ్ కుమార్ అలర్ట్ చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మంచి నిర్ణయం ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో ఇదివరకు పాముకాటు మరణాన్ని నిర్ధారించడం అనేది పెద్ద తలనొప్పిలా ఉండేది. ఆ ప్రక్రియ ఎంతకీ పూర్తయ్యేది కాదు. ఎన్నో లోపాలు దాన్లో ఉండేవి. అక్కడి ఫోరెన్సిక్ ల్యాబ్ సరిగా పనిచేసేది కాదు. పాము ఎక్కడో కాటువేస్తే... ఇంకెక్కడో రకరకాల టెస్టులు చేసి గందరగోళం రిపోర్టు ఇచ్చేది. దాంతో... చాలా మంది రైతులు... పాముకాటుతో చనిపోయినా... అలా చనిపోయినట్లు లెక్కల్లో వచ్చేది కాదు. తాజాగా ప్రభుత్వం... అసలీ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టే అవసరం లేదని చెప్పింది. ఎప్పట్లాగే పోస్ట్‌మార్టం జరుపుతారు. కానీ విసెరా రిపోర్ట్ (viscera report) అవసరం లేదు. జిల్లా అధికారులే పాముకాటుతో చనిపోయిందీ లేనిదీ డిసైడ్ చేస్తారు. చేసి, వెంటనే పరిహారం ఇస్తారు.
Govt declares that cases of snakebite will be treated as state disaster. The victims' kin will be entitled to a compensation of Rs 4 lakh each: Manoj Kumar Singh, Additional Chief Secretary, Uttar Pradesh Government pic.twitter.com/RhI2kc9y1l
— ANI UP (@ANINewsUP) July 12, 2021
ఉత్తరప్రదేశ్‌లో ప్రతి సంవత్సరం వర్షాకాలం రాగానే... పుట్టల్లో పాములు... వర్షపు నీరు పుట్టల్లోకి వచ్చేస్తుంటే... ఆ నీటిలో ఉండలేక... బయటకు వస్తున్నాయి. అలా వచ్చిన పాములు... ఎక్కడికి వెళ్లాలో తెలియక... ఆహారం కోసం... పొలాలవైపు వెళ్తున్నాయి. అదే సమయంలో... వరి నాట్లు, ఇతర సాగు చేపట్టే రైతులకు ఏది పామో, ఏది గడ్డి మొక్కో తెలియక పాములపై కాళ్లు వేస్తున్నారు. దాంతో... ప్రాణ రక్షణ కోసం పాములు కాటేస్తున్నాయి. అవి విషపూరితమైనవి కావడంతో... రైతులు ఆస్పత్రికి వెళ్లేలోపే చనిపోతున్నారు. లంఖింపూర్ ఖేరీ, ఫిలిబిత్, గోరఖ్‌పూర్, దేరియా ప్రాంతాలు... పాములకు హాట్ బెడ్స్‌గా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Gold Rates 13 July 2021: తగ్గిన బంగారం, వెండి ధరలు... నేటి మార్కెట్ అప్‌డేట్స్
తాజాగా షరాన్‌పూర్‌లో ఓ మంచంపై నిద్రపోతున్న 4 ఏళ్ల పిల్లాణ్ని పాము కాటు వేసింది. తెల్లవారు జాము 4 గంటలకు ఇది జరిగింది. టెర్రస్ పై వెళ్తూ పాము... పట్టుతప్పి పిల్లాడిపై పడింది. పిల్లాడు కెయ్యి మని అరవడంతో... కంగారుపడిన పాము... బుస్సుమని... ముఖంపై కాటువేసింది. ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఐతే... యూపీలోనే కాదు... దేశవ్యాప్తంగా పాముల వల్ల రైతులు, ప్రజలు చనిపోతున్నారు. మరి మిగతా రాష్ట్రాలు కూడా ఇలా వీటిని విపత్తుగా ప్రకటించి... పరిహారం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh, VIRAL NEWS, Yogi adityanath