లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం కేంద్రంలోని బీజేపీకి షాకింగ్ ఆదేశమే. అదే సమయంలో ప్రతిపక్షాలకు ఇది వరంగా మారబోతోంది. ఆదివాసీ చట్టాల్ని కేంద్రం పట్టించుకోవట్లేదని విమర్శించే అవకాశాలున్నాయి. 2006 నాటి గిరిజనులు, ఇతర అడవుల్లో నివసించేవారికి సంబందించి చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ... వైల్డ్ లైఫ్ ఎన్డీవోలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందనీ, అడవులు, అక్కడి జంతువులు, సహజ సంపద నాశనమయ్యే ప్రమాదం ఉందని ఆ స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తంచేశాయి. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం... జులై 27 నాటికి దాదాపు 11 లక్షల కుటుంబాలు అడవుల్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలా జరగకపోతే తీవ్ర పరిణామాలుంటాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
2018 డిసెంబర్ నాటికి ఉన్న డేటా ప్రకారం... దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి 23 లక్షల మంది గిరిజనులు అడవుల్లో నివసిస్తున్నా్రు. 2006 నాటి చట్టం ప్రకారం గోండులు, ముండాలు లేదా డోంగ్రియా కోందులకు అడవుల్లో నివసించే హక్కుంది. అక్కడి భూముల్లో వ్యవసాయం చేసుకునే హక్కు ఉంది. ఐతే... దేశంలో అలాంటి హక్కు ఉన్నవారు 2 శాతం మంది మాత్రమే. మిగతా వారంతా చట్ట వ్యతిరేకంగా అడవుల్లో నివసిస్తున్నట్లు లెక్క. వాళ్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడే అవకాశాలు లేవు. పైగా సుప్రీంకోర్టు ఆదేశాన్ని పాటించాల్సిందే. ఫలితంగా ఎన్నికల సమయంలో ఆయా వర్గాల ప్రజల నుంచీ కేంద్రం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు.
సుప్రీంకోర్టు ఆదేశంపై కేంద్రప్రభుత్వం సైలెంట్‌గా ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం కేంద్రంపై మండిపడుతోంది. అన్యాయంగా గిరిజనుల్ని అడవుల నుంచీ తరలించేందుకు కేంద్రం యత్నిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఇటీవల కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం ఆదేశం రాజకీయంగా దుమారం రేపేదే. ఎందుకంటే దేశంలో 9 శాతం జనాభా గిరిజనులే. వారికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం అమలైనా అది రాజకీయంగా కేంద్రానికి ఎదురుదెబ్బే అవుతుంది. గిరిజనులకు అనుకూలంగా ఆర్డినెన్స్ జారీ చెయ్యాలని సీపీఎం నేత బృందాకారత్ డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Narendra modi, National News, Rahul Gandhi, Supreme Court