హిందు - ముస్లిం పెళ్లిళ్లపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

కోర్టు దృష్టిలో వారు హిందు - ముస్లిం కాదని, వారిద్దరూ 18 సంవత్సరాలు దాటిన పెద్దలు కాబట్టి తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ వారికి ఉంటుందని స్పష్టం చేసింది.

news18-telugu
Updated: November 24, 2020, 11:15 AM IST
హిందు - ముస్లిం పెళ్లిళ్లపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హిందు - ముస్లింల పెళ్లిళ్లకు సంబంధించి ఉత్తర్ ప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. మతాంతర వివాహాలకు సంబంధించి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో ఈ తీర్పు చెప్పడం విశేషం. కోర్టు దృష్టిలో వారు హిందు - ముస్లిం కాదని, వారిద్దరూ 18 సంవత్సరాలు దాటిన పెద్దలు కాబట్టి తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ వారికి ఉంటుందని స్పష్టం చేసింది. ఇద్దరు పెద్దలు కలసి సహజీవనం చేయడానికి కోర్టు అంగీకరిస్తుంది. వారు ఆడ - ఆడ, మగ - మగ కావొచ్చు. లేకపోతే ఆడ - మగ అయినా కావొచ్చు. అలాంటి వారి జీవితంలోకి వ్యక్తులు కానీ, కుటుంబం కానీ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఆ రకంగా ఓ రాష్ట్ర ప్రభుత్వం కూడా మతాంతర వివాహాల విషయంలో జోక్యం చేసుకోలేదని కోర్టు కుండబద్దలు కొట్టింది.

సలామత్ అన్సారీ అనే యువకుడు, ప్రియాంకా ఖర్వర్ అనే యువతి 2019 ఆగస్టు 19న పెళ్లి చేసుకున్నారు. ముస్లిం సంప్రదాయ పద్ధతిలో వారి పెళ్లి జరిగింది. వివాహం అనంతరం ప్రియాంకా తన పేరును అలియాగా మార్చుకుంది. వారిద్దరూ తమ తమ కుటుంబాల అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారు. దీనిపై ప్రియాంకా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.

ఈ క్రమంలో సలామత్, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని, భద్రత కల్పించాలని కోరారు. పిటిషన్లను విచారించన కోర్టు ప్రియాంక వయసు విషయంలో ఎలాంటి వివాదం లేదని, ఆమెకు 21 సంవత్సరాలు కాబట్టి తనకు నచ్చిన వారిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఆమెకు ఉంటుందని స్పష్టం చేసింది. ఆమె భర్తతో కలసి ఉండేందుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో పోక్సో చట్టం వర్తించదని తేల్చి చెప్పింది. సలామత్‌పై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసింది.

అదే సమయంలో యువతి తండ్రి తన కుమార్తెను కలిసే హక్కు కూడా ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ప్రియాంకా ఖర్వార్ లేకపోతే అలియా ఎవరైనా కావొచ్చు ఆమె తనకు నచ్చిన వారిని కలిసే స్వేచ్ఛ ఉంటుందని తెలిపింది. మరోవైపు ప్రియాంకా తన కుటుంబం మీద కూడా గౌరవం కలిగి ఉంటుందని కోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే, పెళ్లి చేసుకోవడానికి మతం మారడాన్ని ఆమె తండ్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం ఇది చెల్లదని వాదించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ అది వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని అనుసరించే వ్యక్తిగత స్వేచ్ఛకు వ్యతిరేకమని అభిప్రాయపడింది. కోర్టు దృష్టిలో ప్రియాంకా ఖర్వార్, సలామత్ అన్సారీ అనేవారు హిందు - ముస్లింలు కాదని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఒక వ్యక్తి తమకు నచ్చిన వ్యక్తితో స్వేచ్ఛగా నివసించే హక్కును కలిగి ఉంటారని తీర్పు వెలువరించిన జస్టిస్ పంకజ్ నఖ్వీ, జస్టిస్ వివేక్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. లవ్ జిహాద్ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో అలహాబాద్ హైకోర్టు తీర్పు కీలకంగా మారింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 24, 2020, 10:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading