ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడం, పెరగడం సహజం. కానీ ఓటర్లు ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉండటం మాత్రం నిజంగా పెద్ద విషయమే అని చెప్పాలి. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా పరిధిలోని 15 పోలింగ్ బూత్‌లలో ఇదే రకమైన పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. మల్కాన్ గిరి జిల్లాలోని చిత్రకొండ, మతిలి పరిధిలోని 15 బూత్‌లలో ఇప్పటివరకు ఒక్క ఓటు కూడా నమోదు కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మావోయిస్టుల ప్రభావం అధికారంగా ఉండే ఈ ప్రాంతాల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ప్రజలను నిర్ణయించుకోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని సమాచారం.
ప్రభుత్వం, ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో భద్రత కల్పించినప్పటికీ... ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రాలేదని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం నుంచి ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడం కూడా ఓటర్లపై ప్రభావం చూపిందని అధికారులు భావిస్తున్నారు. మావోయిస్టుల హెచ్చరికలను ఉల్లంఘిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో అని ఆందోళనకు గురైన ఓటర్లు... పోలింగ్‌కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కలహంది ప్రాంతానికి చెందిన ఓటర్లు తమ ప్రాంతంలో అభివృద్ధి జరగడం లేదనే కారణంగా ఎన్నికలను బహిష్కరించారు.
Published by:Kishore Akkaladevi
First published:April 11, 2019, 18:19 IST